Congress Govt | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): సన్నాల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. బోనస్ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. అవి ఎంత తక్కువ సాగైతే అంత మంచిదని భావిస్తున్నది. సన్న ధాన్యాన్ని సాగుచేసే రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్న హామీపై రేవంత్ ప్రభుత్వం నోరు మెదపకపోవడం, సన్నాల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలోని ధాన్యాన్ని పండించే రైతులందరికీ క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. కేవలం సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించింది.
ఈ మేరకు మే 20న క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బోనస్ ఇచ్చే సన్న రకాల జాబితాను ఆ మరసటి రోజే విడుదల చేస్తామని చెప్పారు. కానీ, ఆ జాబితా ఇప్పటికీ వెలువడలేదు. సన్నాల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ రైతులకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. కనీసం సన్నాల సాగును పెంచాలని రైతులకు పిలుపు కూడా పిలుపునివ్వలేదు. దీంతో ఏది సన్న రకమో, ఏ రకం ధాన్యాన్ని సాగు చేయాలో తెలియక రైతులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల వ్యవసాయ వర్సిటీ నిర్వహించిన విత్తన మేళాలో రైతులు సన్న రకాల కోసం పోటీ పడ్డారు. ఆ తర్వాతైనా అటు ప్రభుత్వం, ఇటు వ్యవసాయ శాఖ సన్న రకాల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం.
బోనస్ భారాన్ని తగ్గించుకునేందుకే
ధాన్యం రైతులకు బోనస్‌ను ఎగ్గొట్టేందుకే సన్నాల సాగు గురించి రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ ఒక్క వానకాలంలోనే దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. అందులో కనీసం 50 లక్షల టన్నుల సన్న ధాన్యానికి బోనస్ చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ప్రభుత్వంపై అదనంగా రూ.2,500 కోట్ల భారం పడుతుంది. యాసంగిలో కొనుగోలు చేసే 30 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని కూడా కలిపితే బోనస్ భారం రూ.4 వేల కోట్లకు చేరుతుంది. దీని నుంచి తప్పించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్నాల సాగును ప్రోత్సహించేందుకు వెనకంజ వేస్తున్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.