యాదగిరిగుట్ట, ఫిబ్రవరి27: పంచావతారమూర్తి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామివారి తిరు కల్యాణోత్సవం అనంతరం విశేష ఘట్టమైన శ్రీచక్రత్ ఆళ్వార్ల పుణ్యతీర్థ స్నాన ఘట్టాన్ని అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముక్కోటి దేవతలు ఆహుతులుగా లోకకల్యాణం కోసం నిర్వహిస్తున్న స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో శ్రీచక్రత్ ఆళ్వార్ల పుణ్యతీర్థ స్నాన ఘట్టం శాస్ర్తోక్తంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.
శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రధానాలయంలో కల్యాణ లక్ష్మీనృసింహస్వామి వారిని దివ్యమనోహరంగా ఆలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్టించారు. ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయణం దారులు, వేద పండితుల మంత్రోచ్ఛరణలు, వేద, ప్రబంధ పారాయణాల మధ్య ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టం చక్రతీర్థ స్నాన వేడుక లక్ష్మీనృసింహస్వామి ఉత్సవ మూర్తులను, చక్రత్ ఆళ్వార్లను మంగళవాయిద్యాలు, వేద పారాయణాలు, భక్తుల జయజయ ధ్వానాలు, కోలాట ప్రదర్శనల మధ్య ఊరేగించారు.
యాగశాల నుంచి ఉత్తర మాడ వీధులు, దక్షిణ మాడవీధుల్లో ఊరేగిస్తూ ప్రసాద విక్రయశాల మెట్ల గుండా విష్ణుపుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. పవిత్ర జలంతో లక్ష్మీసమేతుడైన యాదగిరీశుడి స్నానమాచరిస్తున్న సమయంలో భక్తుల జయజయ హర్షధ్వానాల మధ్య యాదగిరికొండ మార్మోగింది. యాదాద్రి వాసా, యాదగిరీశా, గోవిందా గోవిందా అంటూ దిక్కులు పిక్కటిల్లాయి. శ్రీచక్రత్ ఆళ్వారులను పుణ్యస్నానాల అనంతరం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
సకల లోక పాలకుడు, అవతారమూర్తి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని వివిధ రకాల పూలతో సహస్రనామ పారాయణాలతో వివిధ రకాల పుష్పాలతో శ్రీపుష్పయాగం సంప్రదాయరీతిలో నిర్వహించారు. అతి వృష్టి, అనా వృష్టి లేకుండా సుభిక్షత కోసం శ్రీదేవి, భూదేవీ సహితుడైన స్వామివారిని సకల పుష్పరాజాలతో అర్చించారు. అనంతరం దేవతోద్వాసన, దోపు ఉత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
లోక కల్యాణం, విశ్వశాంతి కోసం ముక్కోటి దేవతల సమక్షంలో నిర్వహించిన నిత్య యాగ పూజ మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఉత్సవ పరిసమాప్తిగా ఆయా దేవతల మంత్ర పఠనాలతో యజ్ఞహవిస్సును అందజేసి యాగ పరిసమాప్తి కోసం మహా పూర్ణాహుతి నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగం గా యజ్ఞాచార్యులు, అర్చక బృందం పాంచరాత్రగమశాస్త్ర రీతిలో ఆలయ యాగ శాలలో చతుస్థానార్చన పూజలు నిర్వహించి, వేదమంత్రాలతో మహా పూర్ణాహుతి నిర్వహించారు. బ్రహ్మోత్సవ సమయంలో ఏర్పడిన సకల దోషాలను తొలగించేందుకు పరిపూర్ణుడైన పరమాత్ముడిని ప్రార్థించి, నిత్య హవిస్సును అందించిన అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకునే మహా పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర రీతిలో జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొండపైన మాడ వీధుల్లోని ఈశాన్య ప్రాంతంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భవానీశంకర్, డీఈవో దోర్బల భాస్కర శర్మ, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Chakra Teerdam
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం పరిసమాప్తి పలుకనున్నారు. ఉదయం 10 గంటలకు స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు స్వామివారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.