మెదక్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): విచారణ చేయకుండానే ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులు ఎలా నమోదు చేస్తారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల మెదక్ మున్సిపల్ ఎన్నిక సమయంలో జరిగిన ఘటనలో ఎస్సీ, ఎస్టీలపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదుచేసి జైలుకు పంపించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విచారణ చేయకుండా కేసులు నమోదుచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నర్సాపూర్, పెద్ద చింత కుంట గ్రామాల్లో గిరిజనులపై దాడి చేసిన కేసులో ఐవోలు మార్చాలని ఎస్పీని ఆదేశించారు. మెదక్ పట్టణంలో అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయించి, పనులు ప్రారంభించాలని సూచించారు. హవేళీఘణపూర్లో భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలిపారు.