హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. నిత్యం వందలు, వేలుగా నేతలు, సామాన్యులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గ్రామ గ్రామాన పార్టీ జెండా రెపరెపలాడుతున్నది. తాజాగా శనివారం మహారాష్ట్రలోని సర్దార్ వల్లభ్‌బాయి పటేల్ పార్టీ (ఎస్వీపీ) బీఆర్ఎస్లో విలీనమైంది. ఈ నెల 24న బీఆర్ఎస్ పార్టీ ఔరంగాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగసభకు మూడు రోజుల ముందు జరిగిన ఈ విలీనం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ‘బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల దృష్ట్యా, ఎస్వీపీ మహారాష్ట్ర శాఖ అన్ని స్థాయిల కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకొని, రాష్ట్ర ప్రజల క్షేమం కోసం పాటుపడాలని భావిస్తున్న బీఆర్ఎస్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. కలిసి పనిచేయటమే కాదు.. మా పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేయాలని తీర్మానించాం’ అని ఎస్వీపీ అధ్యక్షుడు బాబాసాహెబ్ షెల్కె ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఔరంగాబాద్‌లో పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డికి తన కార్యవర్గంతో వచ్చి పార్టీ విలీన లేఖను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీపీ సలహాదారు ప్రొఫెసర్ బలభీంరావ్ చవాన్, మహారాష్ట్ర ప్రదేశ్ వరింగ్ ప్రెసిడెంట్ సుభాష్ బోరికర్, ఉపాధ్యక్షుడు ఖ్వాజాషేక్, ప్రధాన కార్యదర్శి దిలీప్ కాజాలే, పశ్చిమ మహారాష్ట్ర రీజినల్ ప్రెసిడెంట్ చేతన్ సాహు, రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ షేక్‌లాల్ నరేగావ్కర్, ఔరంగాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎల్ లడ్డా, సోలాపూర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిన్న అడ్వా, జాల్నా జిల్లా అధ్యక్షుడు లఖన్ముంగ్సే, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ శిరసాత్, బీడ్ జిల్లా అధ్యక్షుడు బాలాసాహెబ్ వాగ్మారే తదితరులతోపాటు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత శంకరన్న దోంగ్డేపాల్గొన్నారు.
అబ్కీ బార్ కిసాన్ కీ సర్కార్ అనే నినాదం మహారాష్ట్ర రైతాంగాన్ని ఆకర్షిస్తున్నదని బాబాసాహెబ్ షెల్కె అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ప్రజలకు ఇస్తున్న హామీలపై విస్తృతంగా చర్చ సాగుతున్నదని చెప్పారు. తమకు కేసీఆర్ కొత్తదారి చూపుతారనే విశ్వాసాన్ని మహారాష్ట్ర ప్రజలు వ్యక్తంచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని తమ పార్టీ అన్ని స్థాయిల్లో చర్చించి బీఆర్ఎస్లో విలీనం చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. ఈ నెల 24న ఔరంగాబాద్‌లో జరిగే బహిరంగ సభలో తమ క్యాడర్ అంతా బీఆర్ఎస్లో చేరుతుందని ప్రకటించారు.
మహారాష్ట్రలో రాష్ట్రస్థాయి నుంచి బ్లాక్ లెవల్ వరకు 1600 మంది పతాధికారులున్న శంభాజీ బ్రిగేడ్ సంస్థ ఇప్పటికే బీఆర్ఎస్కు జైకొట్టింది. గత నెలలో బ్రిగేడ్ ప్రతినిధి బృందం హైదరాబాద్‌కు వచ్చి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో చర్చించింది. తమ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తాము బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వటమే కాకుండా బీఆర్ఎస్ కార్యాచరణే తమ కార్యాచరణ అని ప్రకటించింది.
ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయవేత్త, భారతదేశం గర్వించతగిన మేధావి శరద్‌జోషి స్థాపించిన సంస్థ షేత్కరీ సంఘటన. మహారాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో ఈ సంస్థకు విస్తృత నెట్వర్క్ ఉన్నది. మహారాష్ట్ర రైతాంగం సమస్యల సాధన కోసం మూడున్నర దశాబ్దాలుగా ఈ సంస్థ పనిచేస్తున్నది. ఈ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ సుధాకర్‌రావు బిందు సీఎం కేసీఆర్‌ను ‘భారతదేశ రైతుమార్షల్’గా అభివర్ణిస్తూ లేఖ రాయటమే కాకుండా వందలాది మంది ప్రతినిధులతో వచ్చి తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ మాడల్‌ను కోరుకొంటున్నారని పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశమంతా మోదీ మాడల్‌ను పాతరేసి కేసీఆర్ మాడల్‌ను తలకెత్తుకొంటున్నారని అన్నారు. బీఆర్ఎస్లో ఎస్వీపీ విలీనమే ఇందుకు నిదర్శమని తెలిపారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని చెప్పారు. మహారాష్ట్రవ్యాప్తంగా బాబాసాహెబ్ షెల్కె ఆధ్వర్యంలో పనిచేస్తున్న అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఎస్వీపీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, కార్యవర్గం అంతా కలిసి తమ పార్టీని విలీనం చేసుకోవాలని కోరటం శుభపరిణామమని పేర్కొన్నారు.