నిజామాబాద్ : కాంగ్రెస్ పాలనలో సామాన్యుడి నుంచి ఉన్నత ఉద్యోగి వరకు కష్టాలు పడుతారు. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తాజాగా వేతనాల కోసం పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) గురువారం ధర్నాకు దిగారు. ఐదు నెలల నుంచి బకాయి పడిన వేతనాలు(Pending salaries) ఇస్తేనే పనిలోకి వస్తామని తేల్చి చెప్పారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి(Kotagiri) పంచాయతీలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు.
వేతనాలు అడిగితే రేపు, మాపు అంటూ రోజులు గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు గురువారం కోటగిరి పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నెలల కొద్దీ జీతాలు ఇవ్వకపోతే ఏం తినాలని, ఎట్లా బతకాలని మండిపడ్డారు. అక్కడి నుంచి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి అక్కడ ధర్నా చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని నినాదాలు చేశారు.