వనపర్తి, జూన్ 14 : వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని పలువురు పారిశుద్ధ్య కార్మికులు వాపోయారు. శుక్రవారం వనపర్తి జిల్లా జనరల్ దవాఖాన ఎదుట ఏఐటీయూసీ నాయకులతో కలిసి జీజీహెచ్, ఎంసీహెచ్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సురేశ్ మాట్లాడుతూ.. మూడు నెలలుగా వేతనాలు లేక దవాఖాన పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. దవాఖానలో పనిచేస్తున్న కార్మికులకు ప్రతినెలా ప్రభుత్వం బడ్జెట్ విడుల చేస్తున్నా క్షేత్రస్థాయిలో కార్మికులకు మాత్రం అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అంబియన్స్ ఏజెన్సీ అవినీతి అక్రమాలపై విచారణ పేరుతో మూడు నెలలుగా వేతనాలను పెండింగ్ ఉంచారని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వేతనాలు మాత్రం అందడం లేదని మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న దవాఖాన వైద్యాధికారులు వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.