ఖమ్మం, డిసెంబర్ 28 : ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ దౌర్జన్యాలు పెచ్చుమీరాయని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలకులు, నాయకులు కలిసి అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో ఎమర్జెన్సీని మించిన అరాచకం కొనసాగుతున్నదని, భట్టి విక్రమార్క అండతో కాంగ్రెస్ గూండాలు బరితెగించి దాడులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో ఆదివారం సండ్ర, లింగాల మీడియాతో మాట్లాడారు. చింతకాని రామకృష్ణాపురంలో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడిచేసి కాలు విరగొట్టారని, బీఆర్ఎస్ దిమ్మెకు కాంగ్రెస్ రంగులు వేశారని ఆరోపించారు. ఈ విషయాలపై ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు.
కొదుమూరులో బాధితులైన బీఆర్ఎస్ కార్యకర్తలపైనే పోలీసులు జులుం ప్రదర్శించారని చెప్పారు. బోనకల్లు మండలం ఆళ్లపాడులో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సంతోషంలో బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ చేసుకుంటుంటే.. కుంకుమ పడిందనే నెపంతో కాంగ్రెస్ గూండాలందరూ కలిసి బీఆర్ఎస్ కార్యకర్తల తలలు పగులగొట్టారని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసి నా పోలీసులు పట్టించుకోవడంలేదని, పైగా బీఆర్ఎస్ కార్యకర్తలపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఓటర్లను ప్రలోభపెట్టారని, తీగలబంజరలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌కు బలవంతంగా కాంగ్రెస్ కండువా కప్పారని వి మర్శించారు. రఘునాథపాలెం మండలం జింకలతండాలోనూ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డాయని ఆరోపించారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.