Bhupalapally |జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఒక్కో లారీకి రూ.4,500 చొప్పున రోజుకు 550 లారీలు.. మొత్తం రూ.24.75 లక్షలు. ఇది ఇసుక క్వారీల్లో గుత్తేదారుల ఒక రోజు అక్రమ ఆదాయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఇసుక రీచుల్లో ఈ వసూళ్ల దందా బహిరంగంగానే కొనసాగుతున్నది. లారీ యజమానులు టీఎస్ఎండీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించేవారు కరువయ్యారు. అధికారుల సహకారం పూర్తిస్థాయిలో ఉండటంతో కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ లేకుండానే ఇసుక లోడింగ్ జరుగుతున్నదని ఫిర్యాదులు వచ్చినా అధికారులు స్పందించడం లేదని వారు మండిపడుతున్నారు. మొన్నటివరకు ఒక్కోలారీకి రూ.7,200, అదనపు బకెట్‌కు రూ.2వేల చొప్పున వసూలు చేసిన కాంట్రాక్టర్లు ఓ మెట్టు దిగి అదనపు బకెట్ లోడింగ్‌ను నిలిపివేశారు. లారీకి రూ.4,500 మాత్రం ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.
జయశంకర్ భూపాపల్లి జిల్లాలోని మహదేవపూర్, పలుగుల, బెగ్లూర్, బొమ్మపూర్, ఎల్కేశ్వరం క్వారీల నుంచి ఇసుక రవాణా జరుగుతున్నది. మరికొన్ని క్వారీలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ఐదు క్వారీల నుంచి రోజుకు సుమారు 550 లారీల ద్వారా ఇసుక రవాణా జరుగుతున్నది. లారీ యజమానులు ఆన్లైన్ బుకింగ్‌తో క్వారీకి వెళ్లినప్పటికీ లోడింగ్ చార్జి రూ.2,600, ఆపరేటర్‌కు రూ.500, లేబర్‌కు రూ.1,200, వే బ్రిడ్జి(కాంటా) దగ్గర రూ.200 మొత్తం రూ.4,500 చొప్పున 550 లారీలకు కలిపి రూ.24,75,000 ఒక రోజుకు అక్రమంగా ఆర్జిస్తున్నారు. అంటే నెలకు రూ.7.42 కోట్లు ఇసుక తోడేళ్ల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఇందులో నుంచి టీఎస్ఎండీఎసీ అధికారుల వాటా ఎంత అని లారీ యజమానులు ప్రశ్నిస్తున్నారు.
ఇసుక క్వారీల కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదులు అందినా చర్యలు కరువయ్యాయి. ఆదిలో హడావిడి చేయడం అనంతరం గాలికి వదిలేయడం పరిపాటిగా మారింది. ఇసుక క్వారీల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని, స్పెషల్ ఆఫీసర్లతో పర్యవేక్షణ జరుపుతామని, ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేస్తామని, లోడింగ్, అన్లోడింగ్ దగ్గర సీసీ కెమెరాలు అమరుస్తామని, మైనింగ్, రెవెన్యూ, పోలీసులతో టీం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. ఆన్లైన్ ద్వారా టన్ను ఇసుకకు రూ.375 చెల్లించి బుకింగ్ చేసుకుంటే ఈ డబ్బులు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ఖజానాలో జమ అవుతుంది. ఇందులో నుంచే ప్రభుత్వం లోడింగ్ చార్జీలు చెల్లిస్తుంది. అయినా, క్వారీల్లో కాంట్రాక్టర్లు అదనపు బాదుడు ఆపడం లేదు. వినియోగదారుడు ఇటు ఆన్లైన్లో, మరోవైపు క్వారీల్లో అదనంగా డబ్బులు చెల్లిస్తూ నష్టపోతున్నాడు.