Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇసుక ఆదాయం సగానికి పడిపోయింది. రియల్ ఎస్టేట్ పతనానికి ఇసుక మాఫియా తోడవడంతో ప్రభుత్వ రాబడికి భారీగా గండి పడింది. తెలంగాణ ఏర్పా టు తర్వాత 2018-19లో అత్యధికంగా రూ.886.43 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకు రూ.376 కోట్లు మాత్రమే ఆదాయం రావడం పరిస్థితికి అద్దం పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నెలన్నర మాత్రమే ఉంది. దీంతో మరో రూ.50-60 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం నేలచూపులు చూస్తున్న విషయ విదితమే. దీనికితోడు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇష్టారాజ్యంగా ఇసుక తోడేస్తుండటం, అధికారులు, కాంట్రాక్టర్లు వారితో మిలాఖతై ఇసుక దోపిడీకి తెరలేపడం ఆదాయంపై తీవ్రంగా ప్రభావం చూపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా టీజీఎండీసీ ఆదాయం గణనీయంగా పడిపోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే మళ్లీ పునరావృతమయ్యే అవకాశముంది. 2014-15లో రూ. 19.12 కోట్ల ఆదాయమే వచ్చింది. దీంతో బీఆర్ఎస్ సర్కారు నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చి పారదర్శకత పెంచడంతో ఆదాయం గణనీయంగా పెరిగింది.
ఈ నేపథ్యంలో ఇసుక ఆదాయాన్ని రూ.832 కోట్లకు పెంచాలని టీజీఎండీసీ ల క్ష్యంగా పెట్టుకున్నది. ఇసుక రీచ్ల వద్ద మూ డు షిఫ్టుల్లో పనిచేసే విధంగా ప్రణాళికలు రూ పొందించింది. అయితే, కంచె చేను మేసిన చందంగా మైనింగ్, రవాణా, విజిలెన్స్ విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ లక్ష్యాన్ని అందుకుంటుందో, లేదో చూడాలి.