కాళేశ్వరం, అక్టోబర్ 4: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్‌లో ఉన్న 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. గోదావరి నది, మానేరు వాగు వరదలతో బరాజ్ గేట్ల ప్రాంతంలో ఇసుక భారీగా వచ్చి చేరడంతో గేట్లు వేసే పరిస్థితే లేదు. ఇసుకను అలాగే ఉంచితే బరాజ్ కింది భాగంలోని బెడ్‌తోపాటు కాంక్రీట్ నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గమనించిన ఇంజినీర్లు ఇసుకను తొలగించాని నిర్ణయించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం అంతగా పడకుండా, బరాజ్ దెబ్బతినకుండా ఉండేందుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంచుకున్నారు. ఇంతలో మళ్లీ వర్షాలు పడటంతో గేట్లు అన్నింటిని మూసి వేసి ఒకో దాన్ని తెరిచి ఫ్లషింగ్ టెక్నిక్ విధానం ద్వారా వరద నీటిని అటుగా మళ్లించి గేట్ల కింద పేరుకుపోయిన ఇసుకను దిగువకు పంపించడంలో సఫలమయ్యారు. ఇదే విధానాన్ని అన్ని గేట్ల విషయంలోనూ అమలు చేయడంతో అన్నారం బరాజ్‌లో పేరుకుపోయిన 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మొత్తాన్ని కూడా దిగువకు పంపించగలిగారు.