Sand Price | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఏటా చలి, వేసవికాలాల్లో రూ.1,400లోపు ఉండే టన్ను ఇసుక ధర.. ఈ ఏడాది మాత్రం రూ.2,000 వరకు పలుకుతున్నది. ఇసుక బజార్ల పేరుతో ప్రభుత్వమే ధరలు పెంచడం ఇందుకు ప్రధాన కారణమని నిర్మాణరంగ నిపుణులు చెప్తున్నారు. ఫలితంగా భారీగా అదనపు భారం పడుతున్నదని వాపోతున్నారు. చలి, వేసవికాలాల్లో టన్ను ఇసుక రూ.1,300-1,400కు పడిపోతుందని గతానుభవాలను గుర్తుచేస్తున్నారు.
కానీ కాంగ్రెస్ సర్కారు తీసుకుంటున్న విధానాలతో కాలాలకు అతీతంగా ధరలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఇసుక అక్రమాలను అరికట్టే పేరుతో అడ్డగోలు తవ్వకాలు, రవాణా నియంత్రణ కారణంగా ఆరు నెలలుగా బహిరంగ మార్కెట్లో ఇసుక ధరలు భారీగా పెరిగాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. టన్ను ఇసుక రూ.2,300 వరకు కూడా చేరుకున్నదని వివరించారు.
ఇసుక ధరలను అదుపుచేస్తామంటూ ప్రభుత్వమే టీజీఎండీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో పలుచోట్ల ఇసుక బజార్లను ఏర్పాటు చేసింది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే టన్ను దొడ్డు ఇసుక రూ.1,600, సన్నఇసుక రూ.1,800కు విక్రయిస్తున్నది. ఆన్లైన్ బుకింగ్ సంక్లిష్టంగా ఉండడంతో సామాన్యులెవరూ పెద్దగా బుకింగ్ చేసుకోవడంలేదు. లారీల యజమానులే బుకింగ్ చేసి సరఫరా చేస్తున్నారు. ఈ ఇసుక బజార్లలో మట్టితో కూడిన నాసిరకం ఇసుకను సరఫరా చేస్తున్నారని విమర్శలున్నాయి. అందుకే ఎక్కువగా బహిరంగ మార్కెట్ నుంచే కొనుగోలు చేస్తున్నామని నిర్మాణదారులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇసుక బజార్లలో ధరను తగ్గిస్తే బహిరంగ మార్కెట్లో ధర తగ్గుతుందని వివరిస్తున్నారు.