Sand Mafia | రవాణాకు రైతుల భూమితో సంబంధం లేదు.. బావులు, బోర్లున్నా లెక్కేలేదు.ఇసుక మాఫియా ఆగడాలకు మానేరు తీరం పొక్కిలవుతున్నది. వీణవంక మండలంలో అడ్డు లేకుండా సాగుతున్న ఇసుకదందా వంక చూసే నాథుడే లేడు. తెలిసినా పట్టించుకునే అధికారీ లేడు. ఎందుకంటే ఆ తవ్వకాల వెనుక ఉన్నది ఓ రాష్ట్ర మంత్రి !
-(కడపత్రి ప్రకాశ్‌రావు)
కరీంనగర్, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్ జిల్లాలో ఇసుక దందాకు అడ్డులేకుండా పోతున్నది. అనుమతి ఒకచోట ఉంటే.. మరోచోట నుంచి అక్రమ రవాణా సాగుతున్నది. వీణవంక మండలం చల్లూరులో ఇసుక క్వారీకి అనుమతి ఉంటే.. ఇప్పలపల్లి గ్రామ శివారులో ఇసుక తోడేస్తున్నారు. మానేరువాగులో బావులు తవ్వుకొని దశాబ్దాల తరబడి వాటినే నమ్ముకొని సాగుచేస్తున్న రైతుల పొట్ట కొడుతున్నారు.
కనీస సమాచారం ఇవ్వకుండా.. బావులను ఇసుకతో పూడ్చడమేకాదు, మోటర్ల కోసం వేసిన స్తంభాలను కూల్చివేసి అదే బావిలో కప్పేస్తున్నారు. అక్కడితో ఆగకుండా నడిచే మోటర్లను కూడా అందులోనే పూడుస్తున్నారు. ఫలితంగా ఒక్కో రైతు లక్షల రూపాయలు నష్టపోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే, అక్కడ జరుగుతున్న కూల్చివేతలు దౌర్జన్యకాండను తలపిస్తున్నాయి. ‘అయ్యా.. మా వద్ద అక్రమంగా క్వారీ నడుపుతున్నారు. మా బావులను పూడ్చివేస్తున్నారు. విచారణ జరిపి న్యాయం చేయండి’ అంటూ పక్షం రోజుల క్రితం బాధిత రైతులు స్వయంగా ప్రజావాణిలో ఫిర్యాదుచేసినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు. కోట్ల రూపాయలు చేతులు మారడం, అధికార పార్టీ అందండలతోపాటు ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి కీలక సహకారం వల్ల కాంట్రాక్టర్ చెలరేగిపోతున్నాడన్న విమర్శలొస్తున్నాయి.
అనుమతి ఒకచోట.. తవ్వకాలు మరోచోట
కరీంనగర్ జిల్లాలోని మానేరు ఇసుకకు రాష్ట్రంలో అత్యధిక డిమాండ్ ఉంటుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని పలుచోట్ల ఇసుక క్వారీలకు అనుమతి ఇస్తారు. అందులో భాగంగానే ప్రస్తుతం మానేరు వాగుపై పలుచోట్ల క్వారీలు నడుస్తున్నాయి. ఆ మేరకు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామ శివారులో మానేరువాగుపై క్వారీ నడుపుకోవడానికి జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చింది. ఇక్కడ 1,86,741 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నట్టు గుర్తించిన అధికార యంత్రాంగం, క్వారీని కాంట్రాక్టర్‌కు అప్పగించింది. నిబంధనల ప్రకారం సదరు క్వారీ చల్లూరు గ్రామ శివారులోని మానేరువాగుపై నడువాలి. ఈ పరిధిలో కొద్ది నెలలపాటు ఇసుక తీసి విక్రయించారు. ఇప్పుడు అక్కడ నీళ్లు నిల్వడం, ఇసుక నిల్వలు అయిపోవడంతో సదరు కంట్రాక్టర్.. చల్లూరు సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఇప్పలపల్లి శివారులోని మానేరువాగుపై కన్నేశాడు. ఇక్కడి ఇసుకకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉండటంతో కొద్ది నెలలుగా రోజుకు వేలాది మెట్రిక్ టన్నుల ఇసుక తీసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం.
గతంలోనూ ఇసుక తవ్వకాల విషయంలో రెండు గ్రామాల మధ్య వివాదం వచ్చినప్పుడు రెవెన్యూ అధికారులు గ్రామ హద్దులు చూపించారు. వాటన్నింటినీ ఉల్లంఘించి ప్రస్తుతం నిర్వాహకులు క్వారీని ఏకంగా ఇప్పలపల్లి శివారులోనే నడిపిస్తున్నారు. రైతుల బావులు పూడ్చి, మోటర్లు, కరెంటు స్తంభాలు అందులోనే కప్పేసి దందా సాగిస్తున్నారు. చేసేది అక్రమమే అయినా సదరు క్వారీ నిర్వాహకులు అక్కడితో ఆగడంలేదు. నిజానికి ఇప్పలపల్లికి చెందిన వందలాది మంది రైతులు మానేరు వాగునే ఆధారంగా చేసుకొని దశబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. అందుకోసం ఒక్కో రైతు బావి కూలిపోకుండా ఉండేందుకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు వెచ్చించి గాజులు నిర్మించుకున్నారు. ఈ బావులకు అధికారికంగా మోటర్లు పెట్టి సాగు చేసుకుంటున్నారు. విద్యుత్తు శాఖకు డీడీలు చెల్లించి, అధికారికంగా పోల్స్ వేసుకొని విద్యుత్తు వాడుకుంటున్నారు. దశాబ్దాలుగా ఈ గ్రామ రైతులకు ఈ బావులే జీవనాధారం.

దాదాపు 500 ఎకరాల వరకు ఈ బావుల నీరు ఆధారంగానే సాగవుతున్నది. కానీ, ఇసుక క్వారీ నిర్వాహకులు ఇసుక తవ్వుకోవడానికి బావులు అడ్డుగా ఉన్నాయని భావించి, రైతుల బావులను నామరూపాల్లేకుండా ధ్వంసం చేస్తున్నారు. మొత్తం ఇసుకతో పూడ్చివేస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. బావి కూలిపోకుండా చుట్టూ వేసిన గాజులను ముక్కలు ముక్కలు చేస్తున్నారు. వీటితోపాటు వేలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన మోటర్లను కూడా అదే బావిలో వేసి కప్పేస్తున్నారు. వాగు నుంచి పొలం వరకు వేసిన పైపులైన్లను ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. కనీస సమాచారం రైతులకు ఇవ్వకుండా మోటర్లు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా.. ఒక్కమాటలో చెప్పాలంటే క్వారీ నిర్వాహకులు దౌర్జన్యకాండనే నడుపుతున్నారు. ఇప్పటికే పదిహేను బావులను పూడ్చివేశారు. అందులో ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ముదుగంటి విజేందర్‌రెడ్డికి చెందిన రెండు బావులను పూడ్చివేశారు. కొలిపాక సదయ్య, లోకిని రాజయ్య, కొలిపాక మల్లయ్య, ముదుగంటి రఘునాథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, పెద్ది ప్రభాకర్‌రెడ్డి, పెద్ది శంకర్‌రెడ్డి, ఉప్పు శంకరయ్య, గోపు రాంరెడ్డి, ఐలయ్య తదితర రైతుల బావులను పూడ్చి వేశారు. ఇదే కోవలో మరో ఇరువై బావులను పూడ్చే దిశగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పలపల్లి శివారులోని మానేరు వాగు బొందల గడ్డను తలపిస్తున్నది.
అధికార పార్టీ అండదండలు..చేతులు మారుతున్న ముడుపులు
ఇక్కడి క్వారీ నిర్వాహకులు.. నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయల విలువ జేసే ఇసుకను అక్రమంగా విక్రయిస్తున్నారన్న విషయం కింది నుంచి పై స్థాయి అధికారుల వరకు తెలుసు. అయి నా ఏ అధికారి కూడా కిమ్మనడు. ఎందుకంటే, కింది నుంచి పై స్థాయి వరకు చేతు లు మారుతున్న ముడుపులే కారణం. అందులోనూ కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు తెలుస్తున్నది. దీనికితోడు ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి అండదండలు. ఎక్కడైనా ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే వారిని ఏదోవిధంగా వేధిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటిని ఆసరాగా చేసుకొని నిర్వాహకులు రెచ్చిపోతున్నారు.
వందలాది లారీలు గ్రామాల్లో దుమ్మురేపుతున్నా.. వారిని ఎవ్వరూ ఏమీ అనరు. యాక్సిడెంట్లు జరిగినా పట్టించుకోరు. ఇదంతా పక్కనపెడితే ‘అయ్యా.. మా ఇప్పలపల్లి గ్రామ శివారులో అక్రమంగా ఇసుక క్వారీ నడుపడమే కాకుండా మా బావులను పూడ్చివేస్తున్నారు. నిర్వాహకులు మా బావులను ధ్వంసం చేయడం వల్ల మోట ర్, కరెంటు పోల్స్, వేసుకున్న పైపులు, బావికి పెట్టిన ఖర్చులు అన్నీ కలుపుకొని ఒక్కో రైతుకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల నష్టం వాటిల్లుతున్నది. దయచేసి విచారణ జరిపి న్యాయం చేయండి’ అంటూ పక్షం రోజులుగా ప్రజావాణిలో స్వయంగా బాధిత రైతులు ఫిర్యాదు చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూసే నాథుడు లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై వివరణ తీసుకోవడానికి టీజీ-ఎండీసీ పీవో వినయ్‌కుమార్‌కు రెండుసార్లు ఫోన్ చేసినా.. ఆయన ఎత్తలేదు. మెసేజ్ పెట్టినా స్పందించలేదు.

కరెంటుపోల్ సహా విరగ్గొట్టిన్రు
నాకు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. వాగులో తవ్వుకున్న బావి మాకు ఆధారం. ఇప్పుడు కాదు, ఏండ్లతరబడి ఇదే బావిని నమ్ముకొని ఎవుసం చేస్తున్నం. ఎన్నడూ ఈ దుస్థితి మా ఊరికి రాలేదు. ఇప్పటికే పదిహేను బావులు కూల్చివేసిన్రు. ఇంకా చాలా బావులు కూల్చడానికి సిద్ధమైన్రు. ఇటీవల మేం అడిగితే.. మీ దిక్కున్న చోట జెప్పుకో అంటున్నరు. అధికారులకు చెప్తే.. తాము ఏమీ చేయలేం అంటున్నరు. నా బావి వద్ద వేసుకున్న కరెంటు పోల్‌ను సైతం విరగ్గొట్టి, అదే బావిలో వేసిన్రు. ఇతకంటే దారుణం, దౌర్జన్యం ఉంటుందా? అధికారులకు కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేసినం. అయినా స్పందన లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– ముదుగండి వెంకట్‌రెడ్డి, రైతు, ఇప్పలపల్లి
వాగునుంచే ఎవుసంకు నీళ్లు
నాకు రెండున్నర ఎకరాల పొలంఉన్నది. నాకు బుద్ధి తెలిసనప్పటి నుంచి ఈ బావినే నమ్ముకొని ఎవుసం జేసుకుంటున్నం. ఇప్పుడు కూడా దీనిని నమ్ముకునే పొలం వేసినం. ఇప్పుడు ఇది కూలగొట్టిన్రు. మోటర్ అండ్లనే పోయింది. బావి చుట్టూ వేసిన గాజులు కూలగొట్టిన్రు.
ఇట్ల పొట్టగొడితే మేం ఏం జేసుకొని బతుకాలే? ఎందుకు చేసిన్రు అంటే ఎవ్వరూ సప్పుడు చేత్తలేరు.
– కొలిపాక మల్లయ్య, రైతు, ఇప్పల్లపల్లి
ఏమాత్రం చెప్పడంలేదు
నాకున్న రెండు ఎకరాలతోపాటు ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఇప్పుడు బావిని కూల్చివేసిన్రు. మోటర్లను అందులోనూ కప్పి పూడ్చివేసిన్రు. మాకు ముందుగా సమాచారం ఇచ్చినా కనీసం మోటర్లు, వేసిన పైపులైన్లకు సంబంధించిన పైపులను తీసుకునే వాళ్లం. మాకు ఏమాత్రం చెప్పకుండా మా బాయిలను కూలగొట్టిన్రు. మా శివారును మొత్తం బొందల గడ్డను జేసిన్రు.
– గోపు తిరుపతిరెడ్డి, ఇప్పలపల్లి రైతు
నా రెండు బావులను పూడ్చివేసిన్రు
నాకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఇప్పుడు కూడా సాగుచేశాను. నాకు మానేరు వాగులో రెండు బావులున్నాయి. ఒక్కో బావికి అన్నీ కలిపి దాదాపు రూ.రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టుకున్నం. బావినుంచి పొలం వరకు పైపులు వేసుకున్నం. దశాబ్దాలుగా నేను ఈ బావులనే నమ్ముకొని వ్యవసాయం చేసే వాడిని. ఇప్పుడు ఈ రెండు బావులను కాంట్రాక్టర్ ఇసుకతో పూడ్చివేసిండు. ఎవరిని అడిగినా ప్రయోజనం లేదు. ప్రజావాణికి వెళ్లి ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోలేదు. దయచేసి ఇప్పటికైనా విచారణ చేసి మాకు న్యాయం చేయాలి.
– ముదుగంటి విజేందర్‌రెడ్డి, రైతు, ఇప్పలపల్లి