Congress Govt | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ) : ఇప్పటికే ఇసుక క్వారీల కాంట్రాక్టర్లను తొలగించి వాటి నిర్వహణ బాధ్యతలన్నీ బడా ఏజెన్సీలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా సరఫరా బాధ్యతలను కూడా బడా ఏజెన్సీలకే అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మైనింగ్ వర్గాల ద్వారా తెలిసింది. ఇసుక డోర్ డెలివరీ బాధ్యతలను పూర్తిగా ఒకట్రెండు బడా ఏజెన్సీలకే ధారాదత్తం చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం నడుస్తున్న ఇసుక లారీలన్నీ ఇక ఏజెన్సీల ఆధీనంలోనే నడవాల్సి ఉంటుంది. ఎంతోకాలంగా ఇసుక రవాణాకు సంబంధించి టీజీఎండీసీలో సుమారు 40 వేలకు పైగా లారీలు నమోదై ఉన్నాయి. వీటి యజమానులు ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇసుక క్వారీల నుంచి హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇసుక కావాల్సిన వారు నేరుగా లారీ యజమానులతో, లేదా స్థానికంగా ఉండే ఇసుక యార్డుల నుంచి కొనుగోలు చేస్తున్నారు.
దీనివల్ల ఇసుక లారీల యజమానులు ఇష్టారాజ్యంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే కారణంతో ఈ విధానాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇటీవల మైనింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో ఇసుక రవాణాలో సమూల మార్పులు తేవాలని ముఖ్యమంత్రి సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇసుక క్వారీల నిర్వహణ కోసం ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను పిలిచిన టీజీఎండీసీ, తాజాగా ఇసుక రవాణా బాధ్యతలను కూడా అప్పగించేందుకు బడా ఏజెన్సీలను ఎంపికచేసే పనిలో పడ్డట్టు తెలిసింది. ఇసుక కావాల్సినవారు నేరుగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వీలు కల్పించాలని, ఇలా బుక్ అయిన ఇసుకను ఎంపిక చేసిన ఏజెన్సీల ఆధ్వర్యంలో సంబంధిత చిరునామాకు డెలివరీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఓలా, ఊబర్ తరహాలోనే ఇసుక ధర, కిలోమీటరుకు అయ్యే రవాణా చార్జీలను నిర్ధారించి ఇసుక బుక్ చేసుకున్నవారికి సరఫరా చేయాలని, ఈ బాధ్యతలన్నీ టీజీఎండీసీ పర్యవేక్షణలో ప్రైవేట్ ఏజెన్సీల ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. చెల్లింపులు కూడా ఆన్లైన్ ద్వారానే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.
ఇసుక రవాణా బాధ్యతను పూర్తిగా బడా ఏజెన్సీలకు అప్పగించే దిశగా పావులు కదుపుతున్న ప్రభుత్వం, ఏడాదికి రూ.5-10 కోట్ల టర్నోవర్ ఉన్న ఒకట్రెండు ఏజెన్సీలను ఆసక్తి వ్యక్తీకరణ టెండర్ల ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్నా.. టెండర్ దక్కించుకున్న ఏజెన్సీకి ఇసుకపై గుత్తాధిపత్యం ఉంటుంది కాబట్టి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రమాదం ఉన్నదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. కృత్రిమ కొరత సృష్టించి ఇసుకను బ్లాక్ మార్కెట్కు తరలించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 40 వేలకు పైగా ఇసుక లారీలు ఉండడం వల్ల ఏ ఒక్కరి గుత్తాధిపత్యానికీ అవకాశం లేదని, ఇసును అంతా ఒకటో, రెండో ఏజెన్సీల చేతిలో పెడితే ప్రజలకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓలా, ఊబర్ సైతం ప్రయాణికుల నుంచి ఒక్కో సమయంలో ఒక్కో విధమైన చార్జీలు వసూలు చేస్తున్నాయి. బుకింగ్ క్యాన్సిల్ చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇదే విధానం ఇసుకలో కూడా ఎదరయ్యే అవకాశం లేకపోలేదన్న ఉదాహరణలను వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఇసుక యార్డ్లు కొనసాగుతుండగా, ఇసుక కావాల్సినవారు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు.కొత్త విధానం వస్తే ఇవన్నీ మూతపడే వీలుందని, దీనివల్ల ఇసుక సులభంగా లభించే అవకాశం లేకుండా పోతుందన్న ఆందోళన కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నది.
ఇంతకాలం సొంతంగా బుక్ చేసుకొని వినియోగదారులకు ఇసుక సరఫరా చేస్తున్న లారీల యజమానులు, ఇకమీదట ఏజెన్సీల ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుంది. వినియోగదారుల నుంచి వచ్చే బుకింగ్ల ఆధారంగా ఆసక్తి ఉన్న లారీలు రవాణా చేసేలా యాప్ను రూపొందిస్తున్నారు. కావాలనుకుంటే వినియోగదారుడి తరహాలోనే లారీల నిర్వాహకులు కూడా బుక్ చేసుకొని సరఫరా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు, ఇసుక రవాణా విధానాన్ని మార్చితే తమ బతుకులు రోడ్డున పడుతాయని ఇసుక లారీల యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొత్త విధానం వచ్చినా ప్రస్తుతం ఎంప్యానల్ అయిన లారీలు ఇసుక రవాణా చేసుకోవచ్చని, అయితే అవి తాము ఎంపికచేసే ఏజెన్సీ ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఇసుక ధర, రవాణా చార్జీలు టీజీఎండీసీ ద్వారానే ఆన్లైన్లో నిర్ధారిస్తారు కాబట్టి ఇందులో ఇసుక లారీల ప్రమేయం ఏమీ ఉండదని, ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని చెల్లింపులు జరిపినవారికి డోర్ డెలివరీ అందిస్తారని చెప్తున్నారు. ఇసుక లారీల యజమానులు బుక్ చేసుకున్నా ఎక్కడికి రవాణా చేస్తున్నారో ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుందని సమాచారం.
ఇసుక క్వారీల వద్ద రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలు సాగించేందుకు ఇచ్చిన ఉత్తర్వులు కేవలం ఇసుక రవాణాకు మాత్రమేనని, ఇసుక తవ్వకాలకు కాదని టీజీఎండీసీ ఎండీ వివరణ ఇచ్చారు. పర్యావరణ శాఖ నిబంధనల ప్రకారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 వరకు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించవచ్చని, రాత్రి వేళల్లో ఇసుక రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు. ‘రాత్రి 9 వరకు ఇసుక తవ్వకాలు’ శీర్షికతో సోమవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన వార్తపై ఎండీ స్పందిస్తూ, ఇసుక క్వారీలు రాత్రి 11 గంటల వరకు కార్యకలాపాలు సాగించే విధంగా ఉత్తర్వులు ఉన్నాయని, అయినా తాము ఇసుక తవ్వకాలు సాయంత్రం 6 వరకే నిర్వహిస్తున్నామని వివరించారు.