Sammakka Saralamma | గూడూరు ఫిబ్రవరి 13: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మచ్చర్ల అపరాజు పల్లి గ్రామాల మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలోని చింతల గట్టు వట్టి వాగు సమ్మక్క సారలమ్మల తిరుగువారం (మినీ)జాతరకు అమ్మవార్ల గద్దెల వద్ద భక్తులు గురువారం రోజున ప్రణమిల్లారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవార్ల గద్దెలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు దూర ప్రాంతాల నుండి కుటుంబ సమేతంగా వేలాదిగా తరలివచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్ద భక్తి పారవశ్యంలో భక్తులు మునిగిపోయారు.
ప్రతి సంవత్సరం మాగ శుద్ధ పౌర్ణమి రోజున గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రారంభమయ్యే అమ్మవారి జాతర ఈ సంవత్సరం మినీ జాతర గా నిర్వహిస్తున్నారు. ఈ జాతరలో అమ్మవార్లు గద్దెల పై కొలువుతీరకున్నా భక్తులు మాత్రం అమ్మ వార్ల మీద నమ్మకంతో పౌర్ణమి రోజు నుండి గద్దెలకు పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరలో పూజారులు, నిర్వాహకులు బుధవారం రోజు అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు చేసిన అనంతరం భక్తులను పూజల, మొక్కుల కోసం అనుమతించారు. జాతర లో గురువారం శుక్రవారం భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవచ్చని, వచ్చే శనివారం వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా అమ్మవార్ల గద్దెల వద్ద కు భక్తులు వేలాదిగా తరలివచ్చి తమ కుటుంబ సమేతంగా పూజలు చేశారు. పూజలలో భాగంగా అమ్మవార్లకు పసుపు కుంకుమ సమర్పించడంతోపాటు వడి బియ్యం సమర్పించి అమ్మవార్లకు చీరే, సారే, బంగారం (బెల్లం) సమర్పించారు. తమ కోరికలు తీరినందుకు మొక్కులు చెల్లించిన భక్తులు తిరిగి మళ్లీ వచ్చే మాఘ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవార్లను మళ్లీ దర్శించుకుంటామని మొక్కుకొని వెళ్లారు. జాతరకు భారీ ఎత్తున భక్తులు తమ స్వంత ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు, ఎడ్లబండ్లలో వేలాది గా తరలివచ్చారు.
అమ్మవార్ల జాతరలో పూజారులు దారం సిద్దు, కారం లక్ష్మయ్య , తాటి సుధాకర్, దారం నరేష్, వాసం రమేశ్‌లు పాల్గొనగా, జాతర కమిటీ అధ్యక్షులు పెనుక నాగయ్య, ప్రధాన కార్యదర్శి వాసం సహదేవులు, బాధ్యులు వాసం భద్రయ్య, సనప వీరస్వామి ,జనార్దన్, దారం సాంబరాజు, వీరభద్రం, అశోకులు జాతరలో ఏర్పాట్లు పరిశీలించారు.
అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్: మళ్లీ రైతు రాజ్యం రావాలని కోరుకుంటూ మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, నాగమయ్య, గోవిందరాజుల గద్దెల వద్ద శంకర్ నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం సంపత్ రావు, నాయకులు కటార్ సింగ్ , ఆకుల రమేష్, మన్మోహన్ రెడ్డి, ఆరే వీరన్న, బోడ కిషన్ బానోత్ రామన్న నాయక్ బోడ ఎల్లయ్య, బెజ్జం రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.