ములుగు : తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక సమ్మక్క-సారలమ్మ జాతర ( Sammakka-Saralamma Jatara) అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka) అన్నారు. ఆదివారం సాయంత్రం మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి మేడారంలో జాతర ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించిన ప్రపంచానికి పరిచయం చేస్తామన్నారు. జాతర కోసం ప్రభుత్వం రూ. 260 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. జాతర నిర్వహణకు రూ.150 కోట్లు, శాశ్వత ఆలయ నిర్మాణ పనులకు రూ.110 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఈనెల 15వ తేదీలోగా అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సమ్మక్క-సారలమ్మ జాతర కేవలం గిరిజన పండుగ మాత్రమే కాదని, అది తెలంగాణ హృదయ స్పందన అని పేర్కొన్నారు.సమ్మక్క-సారలమ్మ జాతర యొక్క ప్రత్యేకతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని వెల్లడించారు.పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, ఇప్పటికే 85 శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు.
జాతర పూర్తయ్యే వరకు ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులతో పాటు అన్ని శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం దేవతమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు.