హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : ‘సమ్మక్క సాగర్ బరాజ్’ ప్రాజెక్టు పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఛత్తీస్‌గఢ్‌లో కొంతమేర ముంపునకు గురవుతుండగా, ఇప్పటికే బ్యాక్‌వాటర్ స్టడీ పూర్తయ్యింది. బరాజ్‌తో ఏ మేరకు ముంపు ఉంటుందనే దానిపై స్పష్టత వచ్చింది. పరిహారం చెల్లింపుపై గతంలోనే మంతనాలు కూడా కొనసాగాయి. ఈ సమయంలో ఏ ప్రభుత్వమైనా చెల్లింపులు పూర్తిచేయడంపై దృష్టిపెడుతుంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మొదటికి తెచ్చింది. రీ సర్వే పేరుతో భారీగా నిధులు స్వాహా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మన రాష్ర్టానికి చెందిన ఓ ఉన్నతాధికారి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఉన్నతాధికారులు కొందరితో చేతులు కలిపి ఈ అక్రమ దందాకు తెగబడినట్టు తెలుస్తున్నది. రూ.లక్షల్లో పూర్తి చేయగల సర్వేకు ఏకంగా రూ.10కోట్ల వరకు ఖర్చు చేయించి భారీగా నొక్కేసేందుకు గూడుపుఠాణీ జరుగుతున్నదని జలసౌధ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
దేవాదుల పరిధిలోని 6.21 లక్షల ఎకరాలతోపాటు ఎస్సారెస్పీ 1, 2 కింద ఉన్న మరో ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం సమ్మక్క సాగర్ బరాజ్ ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందించింది. బరాజ్‌తో 50 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకునేలా తుపాకులగూడెం వద్ద 1.2 కిలోమీటర్ల పొడవు, 92 మీటర్ల ఎత్తుతో 6.94 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బరాజ్ (సమ్మక్కసాగర్)ను ప్రతిపాదించింది. బరాజ్ ఫూర్తిస్థాయి నీటి నిల్వ మట్టం(ఎఫ్ఆర్ఎల్) 83 మీటర్లుగా నిర్ణయించింది. సమ్మక్కసాగర్ బరాజ్‌కు సంబంధించిన డీపీఆర్‌ను గతంలోనే కేంద్రానికి సమర్పించింది. సీడబ్ల్యూసీలోని దాదాపు అన్ని డైరెక్టరేట్ల నుంచి అనుమతులు వచ్చాయి. అయితే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలతో ఇంటర్‌స్టేట్ డైరెక్టరేట్ వద్ద అనుమతుల ప్రక్రియ పెండింగ్ పడింది. బరాజ్ 83 ఫీట్ల వద్ద నీటిని నిల్వ చేసినప్పుడు తమ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం వ్యక్తంచేసింది.
ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) తీసుకువస్తేనే అనుమతులు మంజూరు చేస్తామని తెలంగాణకు సీడబ్ల్యూసీ సూచించింది. ఇదే విషయమై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌తో అనేకసార్లు సంప్రదింపులు జరిపింది. కోరిన మేరకు నష్టపరిహారం ఇస్తామని తెలిపింది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో 83 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద ముంపును నిర్ధారించే బాధ్యతను ఐఐటీ ఖరగ్‌పూర్‌కు అప్పగించింది. ఛత్తీస్‌గఢ్‌లో బరాజ్ బ్యాక్‌వాటర్ ఎఫెక్ట్‌ను అధ్యయనం చేయించింది. బరాజ్ బ్యాక్‌వాటర్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని భూపాలపట్నం తహసీల్ వరకు విస్తరించి ఉంటుందని అధ్యయనంలో తేలింది. అటవీ, పట్టాభూమి, నాలా ప్రాంతంతోపాటు గరిష్ఠంగా 136 ఎకరాల వరకు ముంపునకు గురవుతుందని ఐఐటీ ఖరగ్‌పూర్ బృందం తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా ముంపు ప్రభావిత ప్రాంతాలకు భూసేకరణ, పరిహారం, పునరావాస అంశాలపై చర్చలు కొనసాగుతున్న క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఛత్తీస్‌గఢ్ కోరిన మేర పరిహారం చెల్లించేందుకు మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సంసిద్ధతను వ్యక్తంచేసింది. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత సెప్టెంబర్‌లో స్వయంగా ఛత్తీస్‌గఢ్ వెళ్లి ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనం మేరకు, ఆ సంస్థ సిఫార్సులను పూర్తిగా అమలు చేసేందుకు సంసిద్ధత తెలిపారు. ముంపు ప్రభావిత ప్రాంతాలకు భూసేకరణ, పరిహారం, పునరావాస ఖర్చులను పూర్తిగా భరిస్తామని, బరాజ్‌కు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయాలని కోరారు. అందుకు ఛత్తీస్‌గఢ్ సీఎం సైతం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రకటించింది. కానీ, తాజాగా మళ్లీ బరాజ్ బ్యాక్‌వాటర్ ముంపును నిర్ధారించేందుకు సర్వే చేయాలని, డిమార్కేషన్ తదితర వాటి కోసం ఏకంగా రూ.9.88కోట్లు అవసరమవుతాయని, ఆ నిధులను సత్వరం చెల్లించాలని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది.
ఈ మేరకు తెలంగాణ సర్కార్‌కు తాజాగా లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. అయితే రీ సర్వే వెనుక భారీ అవినీతి దాగి ఉన్నదని, తెలంగాణకు సంబంధించిన ఓ ఉన్నతాధికారే చక్రం తిప్పుతున్నాడని జలసౌధ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వాస్తవంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బరాజ్ బ్యాక్‌వాటర్ ఎఫెక్ట్ చాలా స్వల్పం. అధ్యయనం చేయించినా గరిష్ఠంగా రూ.50 లక్షలు కూడా ఖర్చు కాదనేది ఇంజినీర్ల వివరణ. కానీ, ఛత్తీస్‌గఢ్ మాత్రం ఏకంగా రీ సర్వే కోసం దాదాపు రూ.10 కోట్లను కోరడం గమనార్హం. అయితే, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి, తెలంగాణకు చెందిన ఓ ఉన్నతాధికారి చేతులు కలిపి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. రీ సర్వే పేరిట నిధులు విడుదల చేయించి, ఇందులో తలా రూ.2 కోట్లు పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారని జలసౌధలో గుసగుసలు వినిపిస్తున్నాయి.