షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అలజడి చెలరేగుతోంది. మాజీ ఎమ్మెల్యే నీరజ్ భారతి పేస్బుక్ అకౌంట్(Facebook Account)ను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఈ చర్యకు పూనుకున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, పార్టీ కేంద్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ నీరజ్ భారతి ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. గత కొన్ని వారాల నుంచి ఆయన సోషల్ మీడియాలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోస్టులు చేశారు. ప్రభుత్వ పనితీరును తీవ్రంగా ప్రశ్నించారు. రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి నీరజ్ చేసిన రాజీనామాను హెచ్‌పీసీసీ ఆమోదించింది. నీరజ్ తండ్రి ఆ రాష్ట్రంలో వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. అయితే సీఎం సుఖ్విందర్ సింగ్ సూకు నేతృత్వంలోని ప్రభుత్వం పనితీరు సంతృప్తికరంగా లేదని నీరజ్ ఆరోపించారు.
కాంగ్రెస్ చీఫ్ వినయ్‌కుమార్‌కు ఆయన తన రాజీనామా లేఖను పంపారు. ఆ లేఖను తన ఫేస్బుక్ అకౌంట్లో కూడా పోస్టు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేస్తున్న నీరజ్ భారతిని కీలక పదవుల నుంచి తప్పించింది. కానీ నీరజ్ ఫేస్బుక్ అకౌంట్‌ను ఎందుకు బ్లాక్ చేశారన్నది సందేహంగా ఉంది. ఫిర్యాదులు రావడం వల్ల ఆ ప్లాట్‌ఫామ్ ఈ నిర్ణయం తీసుకుందా లేదా తెలియడంలేదు. పాలసీ ఉల్లంఘనలు, టెక్నికల్ సమస్యలు ఏమైనా వచ్చాయా అని ఆరా తీస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నీరజ్ పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.