Pawan Kalyan | వైద్య రంగంలో సాంకేతికత రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా మెదడుకు సంబంధించిన క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో వైద్యులు అనుసరిస్తున్న వినూత్న విధానాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. రోగి పూర్తిగా స్పృహలో ఉండగానే మెదడుకు ఆపరేషన్ చేసే ‘అవేక్ బ్రెయిన్ సర్జరీ’ విధానం ఇప్పుడు మరింత విస్తృతంగా అమలవుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఇలాంటి ఓ అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గనిపిశెట్టి రాఘవులు, కోటేశ్వరమ్మ దంపతులు ప్రస్తుతం గుంటూరు జిల్లా పొన్నూరులో కిచిడీ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా కోటేశ్వరమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె ఒక్కసారిగా మూర్ఛపోయి కిందపడటంతో కుటుంబ సభ్యులు వెంటనే వడ్లమూడిలోని ఆసుపత్రికి తరలించారు.
అక్కడ న్యూరో సర్జన్ డాక్టర్ పద్మనాభుని అరుణ్‌కుమార్ పలు వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించారు. పరీక్షల అనంతరం కోటేశ్వరమ్మ మెదడులో గడ్డ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆ గడ్డ శరీర కదలికలు, నాడీ వ్యవస్థ పనితీరును నియంత్రించే కీలకమైన మెదడు భాగానికి సమీపంలో ఉన్నట్లు నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో సాధారణ మత్తుమందుతో శస్త్రచికిత్స చేయడం కంటే, రోగి స్పృహలో ఉండగానే ఆపరేషన్ నిర్వహించడం సురక్షితమని వైద్య బృందం నిర్ణయించింది. దీంతో ‘అవేక్ బ్రెయిన్ సర్జరీ’ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ విధానంలో రోగి మెలకువలో ఉండటం వల్ల మెదడులోని ముఖ్యమైన నాడీ భాగాలకు ఎలాంటి నష్టం కలగకుండా వైద్యులు నిరంతరం పరిశీలించగలుగుతారు.
సర్జరీ సమయంలో రోగి ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ఆమెకు ఇష్టమైన సినిమా చూపించాలని వైద్యులు నిర్ణయించారు. కోటేశ్వరమ్మకు అత్యంత ఇష్టమైన నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని తెలుసుకున్న వైద్యులు, ఆయన నటిస్తున్న ‘ఓజీ’ చిత్రానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. సర్జరీ జరుగుతున్న సమయంలో కోటేశ్వరమ్మ సినిమా చూస్తూనే వైద్యులతో మాట్లాడారు. డాక్టర్లు ఇచ్చిన సూచనలకు స్పందిస్తూ సహకరించారు. ఇదే సమయంలో వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా మెదడులోని గడ్డను తొలగించింది. నాడీ వ్యవస్థకు ఎలాంటి హాని కలగకుండా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. డాక్టర్ పద్మనాభుని అరుణ్‌కుమార్ నేతృత్వంలోని న్యూరో సర్జరీ బృందంతో పాటు అనస్థీషియా నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ మరియు ఆయన బృందం ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు.
శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రోగి కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అరుదైన వైద్య విజయాన్ని అభినందిస్తూ ఆసుపత్రి ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సినిమా చూస్తూ, అభిమాన హీరోను ఆస్వాదిస్తూ జరిగిన ఈ అవేక్ బ్రెయిన్ సర్జరీ ప్రస్తుతం వైద్య రంగంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Surge.