హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వేతనాలు పెంచింది. రాష్ట్రంలోని 71,400 మందికి లబ్ధి చేకూ ర్చి.. వారి కుటుంబాల్లో సంబురం నింపింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం వేతనాలు పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన వేతనాలు జూలై 1 నుంచే అమల్లోకి వస్తాయని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం అంగన్వాడీ టీచర్ల నెల వేతనం రూ. 13,650, మినీ అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.7,800, హెల్పర్ల వేతనం రూ.7,800కు పెరిగింది. వేతనాల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సంబురాలు చేసుకుంటున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల సం ఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపాయి.
ముచ్చటగా మూడుసార్లు
స్వరాష్ట్రంలో ఏడేండ్లలో అంగన్వాడీలకే ప్రభుత్వం మూడుసార్లు వేతనాలు పెంచింది. రాష్ట్రం ఆవిర్భవించిన 9 నెలలకు అంగన్వాడీ టీచర్లకు రూ.4,200 నుంచి 7000, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రూ.2,200 నుంచి రూ.4,500కు వేతనాలు పెంచింది. 2017 ఫిబ్రవరి 27న అంగన్వాడీ టీచర్లు, ఆయాలను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు పిలిపించి, కలిసి భోజనంచేసి రెండోసారి వేతనాలు పెం చారు. ఉద్యోగులకు ఇటీవల 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన సందర్భంలోనే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, అంగన్వాడీ, ఆశ, హోంగార్డు తదితర అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ వర్తింపజేస్తామని సర్కారు ప్రకటించింది. అందులోభాగంగా ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఏడేండ్లలో దేశంలో ఎక్కడాలేనివిధంగా అంగన్వాడీ టీచర్లకు మూడురెట్ల కంటే అధికంగా (325%), మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు మూడున్నర రెట్లు (354%) వేతనాలు పెరగడం విశేషం. రాష్ట్రంలో ప్రస్తుతం 31,711 అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు (మొత్తం 35,700) ఉన్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్, ఒక ఆయా ఉంటారు.
చిరుద్యోగులకు సముచితస్థానం
శ్రమను గుర్తించిన మానవీయ పాలకుడు సీఎం కేసీఆర్. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చిరుద్యోగులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది.
– రాంబాబుయాదవ్, టీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు 30 శాతం ఫిట్మెంట్ వర్తించాలని చెప్పిన గొప్ప నేత సీఎం కేసీఆర్. సంఘం తరఫున సీఎం కేసీఆర్‌కు, మంత్రి సత్యవతిరాథోడ్‌కు కృతజ్ఞతలు. – నల్లా భారతి, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు