హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి నయా దేశ్ముఖ్లాగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టుశంకర్పై కాంగ్రెస్ గూండాలు పథకం ప్రకారం దాడి చేశారని, ఇందుకు సీసీ ఫుటేజీ ఉన్నదని బాల్క సుమన్ చెప్పారు. శంకర్‌ను చంపాలనే పాశవిక దాడికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత శశిధర్‌రెడ్డి అనుచరుడు సాయిరాంరెడ్డి శంకర్ హత్యకు రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డిని సాయిరాంరెడ్డి కలిశాకే ఈ దాడి జరిగిందని తెలిపారు. ప్రస్తుతం జర్నలిస్టు శంకర్ తీవ్రగాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇటీవలికాలంలో జర్నలిస్టులు చిలుక ప్రవీణ్, రంజిత్, ఆకుల ప్రవీణ్, శ్రీనివాస్‌రెడ్డిపైనా దాడులు, వేధింపులు జరిగాయని తెలిపారు. కాంగ్రెస్ పాలన మూడు నెలలు కాకముందే అనేక అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయని, మేడారంలో సీఎం రేవంత్ ముందే భక్తులపై పోలీసులు లాఠీచార్జీ చేశారని వివరించారు. ఇప్పటి దాకా బీఆర్ఎస్ కార్యకర్తలపై 2,600 అక్రమ కేసులను నమోదు చేశారని తెలిపారు.
ప్రశ్నించే గొంతులపై దాడుల చేయడమే ప్రజాపాలనా? కేసులు, కూల్చివేతలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు ఉండటమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తున్నదని క్రాంతికిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాపాలన కాదని, తెలంగాణ మీద ప్రతీకార పాలనగా ఉన్నదని ధ్వజమెత్తారు. అందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడులు చేస్తూ ఉల్టా కేసులు పెడుతున్నారని, ఇప్పటివరకు 24 అక్రమ కేసులు నమోదు చేశారని తెలిపారు. ప్రజా సమస్యలపైనే స్పందించే జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు సరికాదని హితవు పలికారు. ప్రస్తుతం కాంగ్రెస్(ఐ) కాస్తా కాంగ్రెస్ (ఆర్)గా అంటే కాంగ్రెస్ రేవంత్, రౌడీలుగా మారిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అభివర్ణించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవి, రామ్మూర్తి యాదవ్ పాల్గొన్నారు.