Sabitha Indra Reddy | అసెంబ్లీలో తమకు మైక్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మైక్ ఇచ్చినా కూడా కట్ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. జీరో అవర్‌ను గంటలు గంటలుగా నడిపిస్తున్నారని తెలిపారు.
ఎన్ని ప్రశ్నలు లేవనెత్తినా సూటిగా సమాధానం ఇవ్వడం లేదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్ చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు కాంగ్రెస్ ఏం చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. చాలా కుంభకోణాలు బయటపెడితే సమాధానం ఉండదని అన్నారు. అక్రమ మైనింగ్‌ను హరీశ్‌రావు సభ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. మైనింగ్‌ను సీజ్ చేయకుండా నోటీసులు ఇవ్వమేంటని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు కాంగ్రెస్‌కు భయమెందుకు అని అడిగారు. ప్రభుత్వ అవినీతిని సభలో ప్రస్తావిస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మైనింగ్ అక్రమాలపై ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని అన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు ఎత్తి చూపిస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కులాన్ని తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీతక్కను ఏమని అవమానించామని ప్రశ్నించారు. రైతుబంధు, యూరియా, నీళ్లు వస్తలేవని అడగొద్దా అని నిలదీశారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలే కదా మాట్లాడేదని అని అడిగారు.
మూసీ పేరుతో పేదల ఇండ్లను కూల్చొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మూసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములను లాక్కోవద్దంటున్నామని అన్నారు. సీఎం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఉన్నతమైన వ్యక్తిగానే స్పీకర్‌ను గౌరవించామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్ని విచారణలు వేసినా ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్ని వేల ఎకరాలు తీసుకున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో సమాధానం చెప్పకుండా వెళ్లిపోతున్నారని మండిపడ్డారు.