అది గౌరవ సభ!… ఆయన చీఫ్ మినిస్టర్!అందరూ కొలువుదీరిన నిండు సభలో తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం, అన్యాయం జరిగింది. సాక్షాత్తూ ప్రభుత్వాన్ని నడిపే ఇద్దరు పెద్దలు.. సీనియర్ సభ్యులైన మహిళా ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో తెలంగాణ సమాజం నివ్వెరపోయింది. ద్రవ్య విని మయబిల్లుపై జరుగుతున్న చర్చకు సంబంధం లేకున్నా సభానాయకుడే స్థాయి మరిచి మహిళా ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం ఒక రకమైన బజారు భాష మాట్లాడటం తీవ్ర వివాదాస్పదమైంది.
బడ్జెట్ సెషన్లో పద్దుల మీద జరగాల్సిన చర్చ హద్దులు దాటింది. తమ వైఫల్యాలను ప్రధాన ప్రతిపక్షం ఎండగడుతుంటే అధికారపక్షానికి ఆవేశమే మిగిలింది. సీరియస్ అంశాలపై సీనియర్ సభ్యులు మాట్లాడుతున్న ప్రతీసారి స్వయంగా ముఖ్యమంత్రే జోక్యం చేసుకుని విషయాన్ని పక్కదారి పట్టించడం ఈ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు నుంచే కనిపిస్తున్నది. బుధవారం ఈ ధోరణి మరింత చెలరేగింది. హోదాను మరిచి ముఖ్యమంత్రి, మంత్రిగణం చిల్లర వ్యాఖ్యలకు దిగారు. చర్చతో, సబ్జెక్ట్‌తో సంబంధంలేకుండా సభలో నోరుపారేసుకున్నారు.
స్వతహాగా సౌమ్యురాలు, రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞురాలు సబితా ఇంద్రారెడ్డి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కోసం గొంతెత్తిన నికార్సైన పట్లోళ్ల ఇంద్రారెడ్డి సతీమణి. చిన్న వయసులోనే భర్త అకాలమరణంతో దు:ఖాన్ని దిగమింగుకొని రాజకీయాల్లోకి వచ్చి రాణించిన ధీర. ఆమెపై ముఖ్యమంత్రి దిగజారుడు వ్యాఖ్యలకు దిగారు. ఆమెతోపాటు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డినీ ఉద్దేశించి మాటలు జారారు. నమ్మితే నిండా ముంచే అక్కలు అంటూ మహిళా నేతల విశ్వసనీయతపై విషం కక్కారు. వారి మాట వింటే జూబ్లీ బస్టాండేనంటూ వీధిభాషను వాడారు. శానససభను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వేలమంది ఈ వాఖ్యలతో ఒక్కసారిగా విస్తుపోయారు. రేవంత్ దృష్టిలో టీడీపీ నుంచి తాను కాంగ్రెస్‌లోకి రావడం కరెక్టేనట! అయితే సబిత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్లడం మోసమట! ఇలా సాగాయి సీఎం వ్యాఖ్యలు.
రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తంచేస్తుండగానే, సబిత ప్రతిస్పందిస్తుండగానే.. ‘ఏం మొహం పెట్టుకుని మాట్లాడుతున్నవ్’ అంటూ ఏకవచన ప్రయోగానికి దిగారు డిప్యూటీ సీఎ భట్టి. సబిత బీఆర్ఎస్లోకి పోవడం వల్ల తనకు ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా పోయిందన్నది ఆయన బాధ. అటు మంత్రులు సీతక్క, దుద్దిళ్ల.. రేవంత్ వ్యాఖ్యలను సమర్థించే పనిలో మరింత వివాదాస్పదంగా మాట్లాడారు. ‘బయట చాలామంది అక్కలున్నరు. వారి గురించే సీఎం మాట్లాడారు. మీగురించి కాదు’ అంటూ మొండివాదనకు దిగి తద్వారా యావత్తు తెలంగాణ
మహిళలను కించపరిచారు.
Telangana | హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రభుత్వం, కేటీఆర్ మధ్య సంవాదం కొనసాగుతున్నది.. వెంటనే అసందర్భంగా లేచిన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కేటీఆర్ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ (గతంలో అధికారపక్షంలో) ఉండి చెప్పీ చెప్పీ ఇక్కడ ముంచి అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నడనుకో జూబ్లీ బస్టాండులో కూర్చోవాల్సి వస్తది’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. సీఎం మాట్లాడిన మాటలు యథాతథంగా.. ‘తాము కలిసి వస్తాం, ప్రభుత్వానికి సహకరిస్తామని కేటీఆర్ పదేపదే చెప్తున్నారు. కలిసి వస్తరా? లేదా? అనేది, అన్నం ఉడికిందా? లేదా? అనేది ఒక మెతుకును చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు సభలకే రానప్పుడు వీళ్లు కలిసి వస్తరంటే నమ్మేదెవరు? అందుకే నేను వారికి సూచన చేస్తున్నా.. కేటీఆర్ వెనకాల ఉండే అక్కలు..’ అంటూ అసందర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో కేటీఆర్ వెనుక సీట్లో సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి కూర్చున్నారు. సీఎం వ్యాఖ్యలు సభలో వాయిదాలకు, ఆందోళనలకు, నిరసనలకు కారణమయ్యాయి.
మహిళా ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని, సీఎం క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సభలో పెద్ద దుమారం రేగడంతో రేవంత్ మళ్లీ వివరణ ఇచ్చారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుందని, ప్రజాజీవితంలో చర్చ ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘సబితక్క నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మాట, భవిష్యత్తు ఉంటుందని చెప్పిన మాట వాస్తవం. వారి మాట విశ్వసించి, సొంత అక్కగా భావించి, కుటుంబ సంబంధాల నేపథ్యంలో, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనాడు కాంగ్రెస్‌లో చేరా. 2018లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోతే, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు సబితక్క నన్ను పిలిచి నువ్వు మల్కాజిగిరి ఎన్నికల్లో పోటీ చేయ్. నేను అండగా నిలబడతా అని మాట ఇచ్చారు. పార్టీ నాకు ఎంపీ టికెట్ ఇచ్చిన మరుక్షణం ఆమె పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరింది. తమ్ముడిగా నన్ను పిలిచి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రోత్సహించి, కేసీఆర్ మాయమాటలకు, అధికారం కోసం కాంగ్రెస్‌ను వదిలి టీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి పొందింది. తమ్ముడిని మోసం చేసింది కాబట్టే ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్‌కు చెప్పిన. వాళ్ల పేర్లు నేను తీసుకోలేదు. కొత్త గవర్నర్‌ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నా. మళ్లీ వచ్చి అన్నింటికీ, అందరికీ సమాధానం చెప్తా’ అని చెప్పి సభ నుంచి వెళ్లిపోయారు.
ఇష్టం లేకపోతే సభ నుంచి వెళ్లిపోండి: శ్రీధర్‌బాబు
ఒక మహిళా ఎమ్మెల్యేపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా మంత్రి శ్రీధర్‌బాబు ఆయనకే మద్దతు పలికారు. మహిళా ఎమ్మెల్యేల పేర్లను సీఎం తీసుకోలేదంటూ లాజిక్ ప్లే చేశారు. ‘సీఎం మాట్లాడుతున్నప్పుడు ఎవరి పేర్లు తీయలేదు. మీ వెనకాల ఉన్న కొంతమంది అంటే.. సభ బయట ఉన్నవాళ్లు కూడా కావొచ్చు. రాజకీయ పరంగా అందరిని నమ్ముకోవద్దని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి వాళ్ల(సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి) పేర్లే తీయలేదు. వాళ్లను రెచ్చగొట్టి సభను చెడగొడుతున్నారు. సీఎం వాళ్ల పేర్లు తీశారా? వాళ్ల పట్ల మాకు, మా సీఎంకు గౌరవం ఉన్నది. వారిని అనలేదు కదా! సభలో సైలెంట్‌గా ఉండాలని చెప్పండి. వారికి ఇష్టం లేకపోతే వెళ్లిపోమనండి’ అని దురుసు వ్యాఖ్యలు చేశారు.
సీఎంకు వత్తాసు పలికిన మహిళామంత్రి సీతక్క
ఎమ్మెల్యే సబితపై వ్యాఖ్యలను ఓ మహిళగా ఖండించాల్సిన మహిళా మంత్రి సీతక్క కూడా సీఎంకే వత్తాసు పలికారు. ‘నాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్లిన సోదరి ఎమ్మెల్యే సబితమ్మతో నేడు కాంగ్రెస్‌లోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గవర్నర్‌కు ఫిర్యాదు ఇప్పించారు. వాళ్లు రాజీనామా చేయించి తీసుకున్నారా? ఒకరిద్దరు మహిళాఎమ్మెల్యేలు మీతో వస్తా తమ్ముడూ! అని చెప్పి ఏం చేశారో..! ఆ బాధ మా సీఎం అనుభవించారు. ఢిల్లీకి వస్తున్నా అని చెప్పి, రాహుల్‌గాంధీ టైం తీసుకున్నాక ఏం చేశారో..! ఆ బాధ అనుభవించారు కాబట్టే కేటీఆర్‌కు సూచన చేశారు. మేం ఎప్పటికీ ఒకేదానికి కట్టుబడి ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు.
భగ్గుమన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు… పోడియం వద్ద బైఠాయింపు
సీఎం వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మహిళా ఎమ్మెల్యేలపై సీఎం అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. ఆమెకు అండగా నిలిచారు. సీఎం రేవంత్‌రెడ్డి తీరును తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేలు కేటీఆర్, కౌశిక్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, వివేకానంద, గంగుల కమలాకర్, పల్లారాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, విజయుడు పోడియం వద్దకు దూసుకెళ్లారు. సభలో ఆందోళనకు దిగారు. స్పీకర్ ఎదుట నిల్చొని నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అరగంట పాటు తమ ఆందోళనను కొనసాగించారు. ‘మహిళలపై సీఎం రేవంత్‌రెడ్డి అహంకారపూరిత వైఖరి నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని, సీఎం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సబితా ఇంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలకు దిగారు. ఒక దశలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైకి దూసుకెళ్లడం గమనార్హం. ప్రభుత్వ తీరు మారకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం వద్ద తమ నిరసనను తీవ్రం చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చప్పట్లు కొడుతూ ‘సీఎం వైఖరి నశించాలి.. నహీ చలేగా.. నహీ చలేగా.. తానీషాహీ నహీ చలేగా’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
మాట్లాడే అవకాశమివ్వాలని దండం పెట్టిన కేటీఆర్
సీఎం వ్యాఖ్యలపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకర్‌ను పదే పదే రిక్వెస్ట్ చేశారు. ఒక దశలో మాజీమంత్రి కేటీఆర్ మూడుసార్లు దండం పెట్టి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. సబితాఇంద్రారెడ్డికి స్పీకర్ కొద్దిసేపు మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. నిరసనలతో సభ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. అయినా వారికి అవకాశం దక్కలేదు.
సభ మధ్యలోనే వెళ్లిపోయిన సీఎం
సీఎం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. దీంతో ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకొచ్చారు. స్పీకర్ ఎంత వారించినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టు వదల్లేదు. కూర్చోవాలని ఎన్నిమార్లు చెప్పినా వెనక్కి తగ్గలేదు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో సభ మొత్తం గందరగోళంతో గాడి తప్పింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కల్పించుకొని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొత్త గవర్నర్ వస్తున్నారని, ఆయనను రిసీవ్ చేసుకొని వచ్చిన తర్వాత అందరికీ సమాధానం చెప్తానంటూ హఠాత్తుగా వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు .. సీఎం పారిపోయారంటూ నినాదాలు చేశారు. సీఎం షేమ్ అంటూ నినదించారు. అనంతరం స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు.
మార్షల్స్ మోహరింపు
వాయిదా అనంతరం సుమారు రెండున్నర గంటల తర్వాత కూడా తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా స్పీకర్ ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యేలు తమ నిరసనను మరింత ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో వాళ్లను సభ నుంచి ఎత్తివేసేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను మోహరించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ చుట్టుముట్టారు. చివరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండానే ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపి.. సభను వాయిదా వేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి మీడియా పాయింట్ వరకు నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
సబితను ఏకవచనంతో సంబోధించిన భట్టి
ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల గొడవకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరింత ఆజ్యం పోశారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఏకవచనంతో సంబోధిస్తూ జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. ‘మూడుసార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి దశాబ్దకాలంపాటు మంత్రిగా కాంగ్రెస్ కొనసాగించింది. అధికారం కోల్పోయాక పార్టీ తొలిసారిగా దళితవర్గానికి చెందిన నన్ను సీఎల్పీ నాయకుడిని చేసింది. ఇలాంటి సమయంలో నా వెనకుండి నడిపించాల్సిందిపోయి బీఆర్ఎస్లో చేరారు. ఇంటికి వెళ్లి మరీ వెళ్లొద్దని బతిమిలాడాను. కానీ నీ అధికారం, నీ స్వార్థం కోసం, నన్ను సీఎల్పీ నాయకుడిగా చేయనీయకుండా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఆవేదన చెందుతున్నానని అంటున్నారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని సీఎంను పట్టుకొని మాట్లాడుతున్నారు. ఏం చేశారని, ఏం సాధించారని, పార్టీలు మారి, పరువుతీసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’ అని మహిళ అని చూడకుండా సబితపై చులకనగా మాట్లాడారు.
మైక్ ఇవ్వాల్సిందే: అక్బరుద్దీన్ ఒవైసీ
సబితాఇంద్రారెడ్డికి మైక్ ఇవ్వాల్సిందేనని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సైతం డిమాండ్ చేశారు. చర్చ కొనసాగుతున్న క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. ఈ క్రమంలో అక్బరుద్దీన్ ఒవైసీ జోక్యం చేసుకుని మాట్లాడారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. సభ్యురాలు సబిత పేరును ఉటంకిస్తూ వ్యాఖ్యలు చేశారని వివరించారు. సభ్యుల హక్కుల ప్రకారం వివరణ ఇచ్చుకునేందుకు ఆమెకు మైక్ ఇవ్వాల్సిందేనని స్పీకర్‌కు తెలిపారు. మాట్లాడేందుకు అవకాశమిచ్చి సభను ఆర్డర్లో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ మైక్ ఇవ్వకపోవటంతో మరోసారి కూడా లేచి ఇదే విషయాన్ని వెల్లడించారు. సబితకు మద్దతుగా నిలిచారు.
అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండే
కేటీఆర్ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ (గతంలో అధికారపక్షంలో) ఉండి చెప్పీ చెప్పీ ఇక్కడ ముంచే అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నడనుకో జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవలసి వస్తది.
– సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం అసలు సబితా ఇంద్రారెడ్డి, సునీత పేర్లను ప్రస్తావించలేదు. కేటీఆర్ వెనకాల వాళ్లు అంటే సబిత, సునీతఅనే ఎందుకు అనుకోవాలి. సభ బయట ఉన్నవాళ్లు కూడా కావొచ్చు.
-మంత్రి శ్రీధర్‌బాబు
నీ స్వార్థం, నీ అధికారం కోసం.. ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నవ్!
– సబితను ఉద్దేశించి ఏకవచనంతో భట్టి
సబిత కంటతడి
ఈ సీఎం ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోయారా? మా ఖర్మకొద్దీ అసెంబ్లీకి వచ్చాం. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావ్? ఏం మోసం చేశాం. ఎవర్ని ముంచాం? అసెంబ్లీలో గంట సమయం ఇవ్వండి.. మా కుటుంబం చరిత్ర ఎటువంటిదో చెప్తా.
– సబితా ఇంద్రారెడ్డి
25 ఏండ్లు నేను, సబితాఇంద్రారెడ్డి కాంగ్రెస్ జెండా మోశాం. అధికారంలో ఉన్నా లేకున్నా కార్యకర్తలను కాపాడుకున్నాం. ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్తో పనిచేశాం. మమ్మల్ని రాజశేఖర్‌రెడ్డి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. మహిళలను ప్రోత్సహించారు. ఆ తర్వాత నన్ను, సబితాఇంద్రారెడ్డిని, డీకే అరుణను అవమానించి వెళ్లగొట్టారు. మేము బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఫామ్‌పై ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చాం. సీతక ఏ పార్టీ నుంచి వచ్చారో ప్రజలకు తెలుసు. మహిళలు ఎంత పని ఉన్నా అన్నలకు, తమ్ముళ్లకు రాఖీలు కడతారు. అలాంటి మహిళలను అసెంబ్లీలో అవమానించారు. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి క్షమాపణ చెప్పాలి.
– సునీతాలక్ష్మారెడ్డి