రంగారెడ్డి, జూన్ 19 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని రైతులపై ప్రభుత్వం కక్షకట్టిందని మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విమర్శించారు. జిల్లాలోని 9 మండలాల్లో నిలిపివేసిన రైతుభరోసా నిధులను వెంటనే రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. గురువారం వారు బీఆర్ఎస్ నాయకులతో కలిసి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సబితారెడ్డి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా అనగానే ప్రభుత్వానికి అపార్ట్మెంట్లు, విల్లాలే గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు.
జిల్లాలో వ్యవసాయం చేసే ఎంతోమంది రైతులున్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, గండిపేట, బాలాపూర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి మండలాలు హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో ఈ మండలాల్లో వ్యవసాయమే లేదని.. ప్రభుత్వం రైతుభరోసాను నిలిపివేసిందని విమర్శించారు. ఈ తొమ్మిది మండలాల్లోని అనేక గ్రామాల్లో వ్యవసాయంతో కూరగాయలు సాగవుతున్నాయని తెలిపారు. జిల్లాలోని 48,184 ఎకరాల్లో సుమారు 60 వేల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారని..వారందరికి రైతుభరోసాను ప్రభుత్వం నిలిపివేయడంపై మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలోని అన్ని మండలాలకు రైతుబంధు అందించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయం పంపిణీ చేయడంలేదని విమర్శించారు. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట, హయత్‌నగర్ మండలాలతోపాటు తుక్కుగూడ మున్సిపాలిటీలోనూ అనేక గ్రామాల్లో రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. వెంటనే ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా పరిధిలోని రైతులకు రైతుభరోసా జమ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.