Telangana | హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : ‘మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందగత్తెల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడం యావత్ రాష్ట్ర మహిళల ఆత్మగౌరవాన్ని అభాసుపాలు చేయడమే.. ఇది సంప్రదాయం అని చెప్తున్న ప్రభుత్వం మహిళా మంత్రులతో వారి కాళ్లు గడిగిస్తే బాగుండేదేమో.. తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక అయిన బతుకమ్మను చెప్పులు వేసుకొని ఆడటం సంప్రదాయమా?’ అని బీఆర్ఎస్ మహిళా నేతలు భగ్గుమన్నారు. వీరవనితలు రాణి రుద్రమదేవి, సమ్మక్క-సారక్క పుట్టిన నేలపైనే మహిళలకు ఇంతటి ఘోర అవమానం జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ మహిళాలోకానికి ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మా ఆడబిడ్డలతో ప్రపంచ అందాల పోటీదారుల కాళ్లు కడిగించడం సిగ్గుచేటు.. ఇందుకు బాధ్యుడైన మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో క్షమాపణలు చెప్పించండి’ అంటూ కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి గురువారం సంయుక్తంగా ఆమెకు లేఖ రాశారు.
మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతామని గొప్పలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీయుల కాళ్లు కడిగించడం దేనికి సంకేతమని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఓవైపు రాష్ట్రంలోని మహిళలు తాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ రాళ్లూ రప్పల్లో నడుచుకుంటూ వెళ్తుంటే, మరోవైపు విదేశీ అందగత్తెల కాళ్లు కందిపోకుండా రెడ్ కార్పెట్లు వేసి స్వాగతం పలకడం.. వాళ్ల కాళ్లు కడిగించి టవల్‌తో తుడిపించడం బాధాకరమని వాపోయారు. ఆడబిడ్డల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలక తప్పదని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ మహిళాలోకానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అందాల పోటీల కోసం వచ్చిన సుందరీమణుల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడమే కాకుండా ఇది మన సంప్రదాయమని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని, అంత సంప్రదాయమే అయితే వరంగల్ జిల్లాలోని ఇద్దరు మహిళా మంత్రులతో వారి కాళ్లు కడిగిస్తే బాగుండేదని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలకు దేవత అని, మనమంతా ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే బతుకమ్మ చుట్టూ అందగత్తెలంతా చెప్పులు వేసుకొని ఆడారని, ఇదేనా సంప్రదాయమని నిలదీశారు. ఆడబిడ్డల జోలికి వస్తే రేవంత్‌రెడ్డి పతనం తప్పదని ధ్వజమెత్తారు. సరస్వతి పుషరాల్లో రేవంత్‌రెడ్డి దంపతుల కటౌట్ కింద అమ్మవారి ఫొటో పెట్టారని, రేవంత్‌కు ఇంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.40 కోట్లు ఖర్చుపెడితే కేసులు పెట్టారని, మరి రూ.200 కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలను ఎందుకు నిర్వహిస్తున్నదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ ‘మన తల్లిదండ్రులు, గురువు, ఇంటి అల్లుడి కాళ్లు కడిగే సంప్రదాయం ఉన్నది. వీళ్లు ఏం గొప్పలు సాధించారని సుందరాంగుల కాళ్లు కడిగించిండ్రు? ఇది తెలంగాణ సంప్రదాయమా? తెలంగాణలో ఆడవాళ్ల కాళ్లు కడిగే సంప్రదాయం ఉన్నదా అసలు?’ అని నిలదీశారు. చౌమహల్లా ప్యాలెస్‌లో సుందరీమణుల కోసం లంచ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఒకో ప్లేట్‌కు రూ.లక్ష ఖర్చు చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ఇవ్వడం మాత్రం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని మండిపడ్డారు.
‘కాంగ్రెస్ 18 నెలల పాలనలో తెలంగాణ మహిళలకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నయి.. మా ఆడబిడ్డలతో ప్రపంచ అందాల పోటీదారుల కాళ్లు కడిగించడం సిగ్గుచేటు.. ఇందుకు బాధ్యుడైన మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో క్షమాపణలు చెప్పించండి’ అంటూ కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని డిమాండ్ చేస్తూ ఆమెకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి గురువారం సంయుక్తంగా లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న మోసాలు, ఎగ్గొట్టిన మ్యానిఫెస్టో హామీలు, జరుగుతున్న అవమానాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న తీరును ఏకరువు పెట్టారు. యునెస్కో గుర్తింపుతో విశ్వఖ్యాతిని దక్కించుకున్న రామప్ప ఆలయం సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లను కడిగించడం తీవ్ర దుమారానికి దారితీసిందని ప్రస్తావించారు. మా ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని అందాల పోటీదారుల పాదాల చెంతన ఉంచడం బాధాకరమని వాపోయారు. ఈ ఘటన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలకు అంతులేని వేదనను మిగిల్చిందని ఉటంకించారు. మహిళా సాధికారత దిశగా అనేక పథకాలు అమలుచేస్తున్నామని ఓ వైపు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇలా దిగజారి వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ చేష్టలు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను అవమానించేలా ఉన్నాయని, ప్రపంచం ముందు తెలంగాణ ఖ్యాతిని మంటగలిపేలా ఉన్నాయని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ‘దశాబ్దాలపాటు సాగిన తెలంగాణ పోరాటం, అమరవీరుల త్యాగాల గురించి అవగాహన ఉన్న మీరు.. మీ ముఖ్యమంత్రి పిచ్చి పనులను నియంత్రించాలి. వెంటనే మా అక్కాచెల్లెళ్లకు క్షమాపణలు చెప్పించాలి’ అని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ సర్కారుపై మహిళలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభు త్వం, తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీయుల కాళ్లు కడిగించడం దేనికి సంకేతం? వాళ్ల కాళ్లు కడిగించి టవల్‌తో తుడిపించడం దౌర్భాగ్యం.. ఆడబిడ్డల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలక తప్పదు. తెలంగాణ మహిళాలోకానికి రాష్ట్ర ప్రభుత్వం
క్షమాపణలు చెప్పాలి.
– సబిత