శంషాబాద్ రూరల్, మే 27: శంషాబాద్ మండలం పెద్దషాపూర్ భూకుంభకోణంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శంషాబాద్‌లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటీవల భూముల కుంభకోణం అంశాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రజల ముందుంచారని తెలిపారు.
ఈ అంశంపై ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పెద్దషాపూర్ గ్రామంలో దాదాపు 94 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు చెందినదిగా పత్రాలు జారీ చేసిన శంషాబాద్ తహసీల్దార్‌ను వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవైపు ఆర్టీవో ప్రభుత్వం భూములుగా చెప్పినా, తహసీల్దార్ ప్రైవేట్ భూములగా నిర్ధారించడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల విలువైన భూములు దోపిడీకి గురవుతున్నాయని ఆరోపించారు. గండిపేట, నాదర్గుల్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమించిన కాంగ్రెస్ నాయకులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, వారి నుంచి భూములను ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూములను తిరిగి తీసుకొనే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు. నియోజకవర్గంలో భూముల కబ్జాకు పాల్పడుతున్న అక్రమార్కుల బండారం త్వరలో బయటకు వస్తుందని స్పష్టంచేశారు. నియోజకవర్గంలో రెండున్నరేండ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు జరుగలేదని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే నేటికీ కనిపిస్తున్నాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడంలేదు కానీ, ఆ పార్టీ నేతలు భూములను కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు.