పరిగి, నవంబర్ 14 : లగచర్ల ఘటనను కాంగ్రెస్ సర్కారు కావాలనే బీఆర్ఎస్ పార్టీపై నెట్టేందుకు కుట్ర పన్నుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. అందుకోసమే అదుపులోకి తీసుకున్న వారిలో కాంగ్రెస్ వారిని పక్కనబెట్టి బీఆర్ఎస్కు చెందిన వారినే పోలీసులతో అరెస్టు చేయించిందని విమర్శించారు. ఇంటెలిజెన్స్, పోలీస్ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్పై నెపం నెడుతున్నారని ధ్వజమెత్తారు. లగచర్ల ఘటనలో అరెస్టయిన రైతులను గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలోని సబ్ జైలులో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్, హరిప్రియానాయక్తో కలిసి సబితారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజాభిప్రాయ సేకరణ స్థలంలోనే పోలీసులను వదిలి కలెక్టర్ గ్రామంలోకి ఎందుకు వెళ్లారని, దీనిని బట్టి చూస్తే కావాలనే డ్రామా ఆడారని స్పష్టంగా అర్థమవుతుందని అనుమానం వ్యక్తం చేశారు.
రాజకీయ లబ్ధికోసమే ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంతోపాటు ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఇరికించాలని యత్నిస్తున్నదని విమర్శించారు. రైతుల ఆవేదన, ఆక్రోశంతో ఉండగా ప్రభుత్వం అహంకారం, అధికారాన్ని ఉపయోగించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు. జైలులో ఉన్న రైతులు, బయట వారి కుటుంబసభ్యుల ఆవేదనను చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్లలో జరిగిన ఘటన దురదృష్టకరమని, ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ఇటు రైతులు, అటు అధికారులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. లగచర్ల ఘటనలో పాల్గొనని వారినీ పోలీసులు అరెస్టు చేశారని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.