ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రూ.80 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు రూ.200 కోట్లకు ఎందుకు పెంచారో చెప్పాలి. తెలంగాణలో పేద, బడుగుబలహీన వర్గాల కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాల్లో పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దారుణంగా మారినయి. ‘మన ఊరు-మనబడి’ పథకం ఈ ప్రభుత్వానికి ఎందుకు నచ్చడంలేదో అర్థమైతలేదు.
Sabitha Indra Reddy | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుపై ప్రభుత్వం అంచనాలు ఎందుకు పెం చిందో చెప్పాలని విద్యాశాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గురుకులాలు, జిల్లా పరిషత్తు పాఠశాలలు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల సంగతేంటో చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అసలు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి ఒక విధానం ఉందా? అని మండిపడ్డారు. ఒక్కొక్క స్కూల్‌కు రూ.80 కోట్లు ఖర్చు చేస్తామని ముందుగా ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు రూ.200 కోట్లకు ఎందుకు పెంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటులో రేవంత్‌రెడ్డివి మాటల కోతలే తప్ప.. చేతలు లేవని, సర్కారుకే స్పష్టతలేదని ఎద్దేవా చేశారు. స్కూళ్ల నిర్మాణ బాధ్యతలు వేరే రాష్ట్రానికి చెందిన ఏజెన్సీకి ఇవ్వాలని కుట్రలు జరుగుతున్నాయని, నిర్మాణ ఏజెన్సీలు తెలంగాణ రాష్ట్రంలో లేవా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో పేద, బడుగుబలహీన వర్గాల కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వంలో దారుణంగా మారాయని సబితాఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రైవేశపెట్టిన ‘మన ఊరు-మనబడి’ పథకం ఈ ప్రభుత్వానికి ఎందుకు నచ్చడంలేదో అర్థంకావడంలేదని అన్నారు. కేసీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను నిందించడం, విమర్శించడంతప్ప సీఎం రేవంత్‌రెడ్డికి వేరే ఏ పనీ చేతకావడంలేదని నిప్పులుచెరిగారు. కేసీఆర్ వల్లే గురుకులాల్లో నాణ్యమైన విద్య లభిస్తున్నదని, ఆ విషయం హర్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో కూడా వెల్లడైందని పేర్కొన్నారు. తెలంగాణలో కులవృత్తులను కేసీఆర్ కాపాడారని, గురుకులాల్లో చదువుతున్నది కులవృత్తులపై ఆధారపడ్డవాళ్ల పిల్లలే కదా అని చెప్పారు. అలాంటి గురుకులాలను కాదని, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పెట్టి, వాటిలో ఎవరికి ప్రవేశాలు కల్పిస్తారో స్పష్టత ఇవ్వాలని, ప్రభుత్వ పెద్దలు పూటకోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
విద్యార్థులతో టాయిలెట్లు కడిగిస్తే తప్పేంటని గురుకులాల ఉన్నతాధికారి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. విద్యార్థులకు ప్రభుత్వం సరైన వసతులు కల్పించకుండా పనులు చేయించడమేంటని, ఇలాంటి పనులు చదువులపై ప్రభావం చూపవా? అని ప్రశ్నించారు. గురుకులాల్లో మౌలిక సదుపాయాల నిర్వహణకు నిధులను ఎందుకు తగ్గిస్తున్నారని నిలదీశారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం రూ.20,000 కోట్లు కేటాయిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2,000 కోట్లను కూడా విడుదల చేయలేదని చెప్పారు. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయంటూ అసత్యపు ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఎన్ని తెరిపించారో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ఓవర్సీస్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన రూ.8,000 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
విద్యావ్యవస్థకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే అవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తెలిపారు. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల అంచనాలు చూస్తే భయమేస్తున్నదని చెప్పారు. స్కూళ్లు ఏర్పాటు చేస్తే సరిపోదని, మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల నియామకంపైనా సర్కారు దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మండల, జిల్లా పరిషత్తు స్కూళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఆ శాఖ సీఎం వద్దే ఉన్నా.. విద్యా వ్యవస్థలపై సమీక్షలు కూడా చేయడంలేదని విమర్శించారు.