కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకాక ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి సిట్ పేరుతో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారంచేసి దశాబ్ధ కాలంపాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని, అలాంటి నాయకుడికి నోటీసులు ఇవ్వడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చరిత్రాత్మకమైన నాయకుడిపై బురదజల్లాలని ప్రయత్నించడం సూర్యుడిపై ఉమ్మి వేయడమే అని పేర్కొన్నారు. పరిపాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ నోటీసులు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులను వేధిస్తే ప్రజలు ప్రభుత్వంపై తిరుగబడే రోజులు వస్తాయని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాజకీయ కక్ష సాధింపుతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేశారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సబ్బండ వర్గాలను ఏకం చేసి, శాంతియుత ప్రజా ఉద్యమాల ద్వారా కేంద్రం మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని గుర్తుచేశారు.

అలాంటి గొప్ప నేతకు సిట్ నోటీసులు ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యవహరించే తీరు ఇదేనా..? అని ప్రశ్నించారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ఆచరణలో అమలు చేయలేక నోటీసుల పేరిట బెదిరించే ప్రయత్నానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నదని మండిపడ్డారు. నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
నిప్పులాంటి కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై గురువారం స్పందించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన పేరుతో రేవంత్‌రెడ్డి కేసీఆర్ కుటుంబంపై రివెంజ్ పాలిటిక్స్ నడిపిస్తున్నాడు అని మండిపడ్డారు.

సింగరేణి బొగ్గు కుంభకోణం టెండర్లలో జరిగిన అవకతవకలను బీఆర్ఎస్ సాక్ష్యాలు సహా రుజువు చేస్తే, దానికి ప్రతీకారంగా ప్రతిపక్ష నాయకులను సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నారు అని ధ్వజమెత్తారు. పరిపాలన విధి విధానాలు తెలియని వాళ్లు పాలకులుగా ఉండటం దురదృష్టకరమని వాపోయారు.