ది బ్లఫ్
అమెజాన్ ప్రైమ్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: ప్రియాంక చోప్రా జోనస్, కార్ల్ అర్బన్, ఇస్మాయిల్ క్రూజ్ కోర్డోవా, సాఫియా ఓక్లీ-గ్రీన్, టెమురా మోరిసన్ తదితరులు
దర్శకత్వం: ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ కుటుంబం కోసం పోరాడే తల్లిదండ్రుల కథలెన్నో తెరపై కనిపించాయి. వీటిలో చాలావరకూ కథానాయకుడి కోణంలో, యాక్షన్ ప్రధానంగా సాగేవే కనిపిస్తాయి. అయితే, తన ఫ్యామిలీని రక్షించుకోవడానికి ఓ తల్లి చేసే పోరాటమే.. ‘ది బ్లఫ్’. ప్రియాంక చోప్రా జోనస్ ప్రధాన పాత్రలో హాలీవుడ్లో తెరకెక్కిన ఈ సినిమా.. అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. తెలుగులోనూ రికార్డ్ ఫ్యూస్ కొల్లగొడుతున్నది. 1846 నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. సముద్రపు దొంగలపై బ్రిటీష్ సైన్యం ఉక్కుపాదం మోపి.. వారి ఆగడాలను అరికడుతుంది. అయినా, కొందరు సముద్రపు దొంగలు అప్పుడప్పుడూ వ్యాపార నౌకలపై దాడులు చేస్తూనే ఉంటారు. అలాంటి వారిలో కెప్టెన్ కాన్నర్ (కాల్ అర్బన్) ఒకడు. అత్యంత క్రూరుడు.
ఒకరోజు టీహెచ్ బోడెన్ (ఇస్మాయిల్ క్రూజ్ కార్డోవా) నౌకపై దాడికి దిగుతాడు. అతని వద్ద ప్రత్యేక ముద్ర కలిగిన అరుదైన బంగారాన్ని గుర్తిస్తాడు. దాన్ని చూడగానే కాన్నర్కు పాత జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. మిగిలిన బంగారం కోసం బోడెన్ను చావగొట్టి.. అతని నౌక వచ్చిన దిశగా తన ముఠాను నడిపిస్తాడు. మరోవైపు బోడెన్ భార్య ఎర్సెల్ బోడెన్ (ప్రియాంక చోప్రా జోనస్).. ఓ మత్స్యకార యువతి. కొడుకు, మరదలితో జీవిస్తూ.. సముద్రంలోకి వెళ్లిన తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కానర్ మనుషులు వాళ్లు ఉన్న ప్రాంతంపై దాడి చేస్తారు. మరి.. వారిబారి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎర్సెల్ ఎలాంటి సాహసం చేసింది? కాన్నర్ లాంటి క్రూరుణ్ని ఎలా ఎదుర్కొన్నది? ఆమె గతం ఏంటి? ఆ బంగారం ఎవరి దగ్గర ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానమే.. ది బ్లఫ్!