ఒకప్పుడు బాలీవుడ్లో ఒక్క సినిమానైనా చేయాలని దక్షిణాది హీరోయిన్లు ఆరాటపడేవాళ్లు. ఇక్కడ మంచిపేరు రాగానే.. బీటౌన్‌లో వాలిపోయేవాళ్లు. తాజాగా, మాలీవుడ్ విలక్షణ నటి కాని కుస్రుతి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. తనను హిందీ చిత్రాల్లోకి తీసుకోవద్దంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ సినిమా ‘అస్సీ’ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుస్రుతి.. బాలీవుడ్ అవకాశాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తనకు హిందీ రాదనీ, అందుకే బాలీవుడ్ సినిమాల్లోకి తనను తీసుకోవద్దని దర్శకులను స్వయంగా కోరుతున్నదట. ఇదే విషయం చెబుతూ.. “హిందీ పరిశ్రమలో నాకు వచ్చే ప్రతి పాత్రనూ నేను చేయలేను. కేరళ, దక్షిణాది నేపథ్యం ఉంటేనే.. ఆ సినిమాకు ఒప్పుకొంటా! తాజాగా, ‘అస్సీ’ చిత్రంలోనూ నా పాత్ర కేరళకు చెందిందే!” అంటూ చెప్పుకొచ్చింది. అయితే, ‘అస్సీ’లో కుస్రుతి పోషించిన అత్యాచార బాధితురాలు ‘పరిమ’ పాత్ర..
సినిమాకు చాలా కీలకమైంది. మొదటగా ఈ పాత్రను డైరెక్టర్ అనుభవ్ సిన్హా వేరేలా అనుకున్నాడట. ఉత్తర భారతం, ఢిల్లీకి చెందిన మహిళగా ఆ పాత్ర ఉండాలని భావించాడట. కానీ, కుస్రుతిని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నాక.. ఆమెకు హిందీ రాదని తెలిసి, పాత్ర నేపథ్యాన్నే మార్చేశాడట. ఇక, భాషతో పడే ఇబ్బందుల గురించీ చెప్పింది. “హిందీలో డైలాగులు గుర్తుపెట్టుకోవడం కూడా నాకురాదు. వాటిని అర్థం చేసుకోవడానికే ఇబ్బంది పడుతుంటా! ఎందుకంటే, హిందీని నేర్చుకోవడం నా వల్లకాదు. నేర్చుకోలేను కూడా!” అని స్పష్టం చేసింది. చివరికి ఇంగ్లీష్ మాట్లాడాలన్నా మనసులో అనువాదం చేసుకోవాల్సిందేనని వెల్లడించింది.
సంస్కృతిపరంగానూ తాను పక్కా మలయాళీనేననీ, తన ఆలోచనలు ఎప్పుడూ మలయాళంలోనే ఉంటాయని చెప్పుకొచ్చింది. ఇక ‘అస్సీ’ సినిమా విషయానికి వస్తే.. ఇందులో ‘పరిమ’ పాత్రలో ఒదిగిపోయింది కాని కుస్రుతి. న్యాయం కోసం పోరాడే అత్యాచార బాధితురాలిగా అద్భుతమైన నటనను కనబరిచింది.
ఈ క్రమంలో విమర్శకుల నుంచి ప్రశంసలూ అందుకున్నది. కేరళకు చెందిన కాని కుస్రుతి.. త్రిస్సూర్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ తీసుకున్నది. పారిస్‌లో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేసింది. 2003లో వచ్చిన ‘అన్యార్’ సినిమాలో చిన్నపాత్రతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘కేరళ కేఫ్’లో చెప్పుకోదగ్గ పాత్ర పోషించింది. మోహన్‌లాల్ నటించిన ‘శిక్కర్’, ‘కాక్టెయిల్’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నేది. ‘బిర్యానీ’ సినిమాకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నది.