మైలార్‌దేవ్‌పల్లి, డిసెంబర్ 4 : లక్షలాది మంది పేద కార్మికుల పొట్టగొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకొచ్చిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. రియల్ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే.. రాష్ర్టాన్ని ఎలా అమ్ముకోవచ్చో రేవంత్‌రెడ్డి చేసి చూపిస్తున్నారని దుయ్యబట్టారు. ఒక రైతు ముఖ్యమంత్రి అయితే.. రాష్ర్టాన్ని ఎలా అభివృద్ధి చేయొచ్చో కేసీఆర్ చేసి చూపించారని కొనియాడారు. గురువారం సబితారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నిజ నిర్ధారణ బృందం కాటేదాన్ పారిశ్రామికవాడలో పర్యటించింది. కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ కే స్వామిగౌడ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పీ కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ..
సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కాలుష్య నియంత్రణ కోసం ఈ కంపెనీలను బయటకు పంపిస్తే ప్రభుత్వం ఆయా భూములను స్వాధీనం చేసుకొని, ప్రజల అవసరాల కోసమే వినియోగించాలని డిమాండ్ చేశారు. ఆ భూముల్లో పేదలకు ఇండ్లు, దవాఖానలు, కాలేజీలు, పార్కులు, శ్మశానవాటికలు నిర్మించాలని సూచించారు. భవిష్యత్తులో రూ.వంద కోట్లు పెట్టినా ఎక్కడా స్థలం దొరికే పరిస్థితి ఉండదని చెప్పారు. ఈ ప్రాంతంలో భూముల మార్కెట్ వ్యాల్యూ ఎకరాకు రూ.20 కోట్లు ఉంటే, ప్రభుత్వం కేవలం రూ.1.1 కోట్లకు రెగ్యులరైజ్ చేయాలని చూస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేసే పోరులో బీజేపీ కూడా మద్దతు ఇచ్చి ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.
హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో కార్మికులు, పరిశ్రమల యజమానులు కూడా కలిసి రావాలని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ విజ్ఞప్తి చేశారు. పోరాటాల కారణంగా సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు పది వేల పారిశ్రామిక భూములను అమ్ముకుంటానని ప్రజలకు సవాల్ విసురుతున్నదని మండిపడ్డారు. ఈ భూములకు సంబంధించి ఇప్పటికే ఇన్నర్ ట్రేడింగ్ జరిగిందని, బిల్డర్లతో ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. డబ్బులు కూడా చేతులు మారాయని, మూడో కంటికి తెలియకుండా వారం రోజుల్లో దీన్ని ఖతం చేయాలని అర్జెంటుగా పాలసీ తీసుకొచ్చారని విమర్శించారు.