కందుకూరు, అక్టోబర్ 23 : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఇచ్చిన మాటలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కందుకూరు మండల పరిషత్ కార్యాలయం సమావేశ హాలులో బుధవారం నిర్వహించిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకానికి అదనంగా తులం బంగారం కలిపి ఇస్తామని ఇచ్చిన మాటను కాంగ్రెస్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎవరు ఔనన్నా.. కాదన్నా కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆరేనని, ఆడబిడ్డలకు పెండ్లిళ్లకు పెద్దగా నిలిచింది ఆయనేనని స్పష్టంచేశారు. మహిళలకు ఇస్తానన్న రూ.2,500, డబుల్ చేసి ఇస్తామన్న పింఛన్ల హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. పదేండ్ల పాటు కేసీఆర్ పాలన ప్రణాళికాబద్ధంగా సాగిందని, 10 నెలలు దాటినా కాంగ్రెస్ సర్కార్ ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి గొప్పలు చెప్పుకొంటున్నదని విమర్శించారు.
ఎన్నికలప్పుడు భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీకి కేటాయించిన భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పారని, వారు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు భూములను తిరిగివ్వాలని సబిత డిమాండ్ చేశారు. రైతుబంధుకు ఎగనామం పెట్టి, కౌలు రైతులను అసలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన రహదారుల పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. విశాలమైన రోడ్డు ఉన్నా రైతుల భూములను లాక్కొని ఫోర్త్ సిటీలో రోడ్డు వేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవాచేశారు.