గుమ్మడిదల, ఫిబ్రవరి 11: ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం ఉధృతంగా కొనసాగుతున్నది. మంగళవారం సమీప గ్రామాల ప్రజలు తమ పశువులను తోలుకొచ్చి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని జాతీయ రహదారి 765-డీపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. వివిధ గ్రామాల ప్రజలు తమకున్న బర్రెలు, ఆవులు, దున్నపోతులను తోలుకొచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘డంపింగ్ యార్డు మాకొద్దు.. మాకడుపులు కొట్టొద్దు’ అన్న నినాదాలతో రాసి ఉన్న ప్లకార్డులను పశువులపై ఉంచి, నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని రైతు జేఏసీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ డిమాండ్ చేశారు. వందలాది మంది ఆందోళనకారులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలు మిన్నంటాయి. గత వారం రోజులుగా పోలీసులు, సీఆర్పీఎస్ బలగాలను మోహరించి డంపింగ్ యార్డు పనులు చేయడంపై మండిపడ్డారు.
డంపింగ్‌యార్డు నిర్మాణం పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గుమ్మడిదల, కొత్తపల్లి గ్రామాల్లో రైతులు మోకాళ్లపై నిల్చొని రిలే నిరహారదీక్షలు చేపట్టారు. నల్లవల్లిలో చేపట్టిన రిలే నిరహారదీక్షలు మంగళవారం నాటికి 7వ రోజుకు చేరాయి. ఈదీక్షల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్టాడుతూ పశువులకున్న సోయి రాష్ట్ర సర్కారుకు లేదా? అని ప్రశ్నించారు. డంపింగ్‌యార్డు పనులను నిలిపి వేసేవరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, రైతులు, మహిళలు, వివిధ పార్టీల నాయకులు, పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు.