Congress | ములుగు, జూలై 12 (నమస్తే తెలంగాణ) : ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ నాయకులు పథకం ప్రకారం ప్రభుత్వాన్ని ప్రజల్లో చులుకన చేసేలా వివాదాన్ని లేవనెత్తారు. రేవంత్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే 3 గంటలే ఇస్తామని చెప్పడంపై రైతుల మనోగతాన్ని తెలుసుకునేందుకు ‘నమస్తేతెలంగాణ’ బృందం ములుగు జిల్లా ములుగు మండలం చిన్నగుంటూరుపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు దేవిరెడ్డి అనంతరెడ్డిని కలిసి మాట్లాడింది. రైతులకు జరిగే అన్యాయంపై ఆయన పూసగుచ్చినట్లు వివరించారు.
రైతులకు 24 గంటల విద్యుత్ ఎలా ఉంది?
అనంతరెడ్డి: కేసీఆర్ ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి అసలు కరెంట్ ఉండని ప్రాంతాల్లో 24గంటల కరెంట్ అందుతున్నది. రాష్ట్రం విడిపోయే ముందట కాంగ్రెస్ నాయకులు కరెంట్ వైర్లకు బట్టలు ఆరేసుకోవాలని అవమానించిన మాటలు మర్చిపోకముందే రెండేళ్లలో సీఎం కేసీఆర్ కరెంట్ కష్టాలు తీర్చిండు. ఊహించని విధంగా ఉచిత కరెంట్ ఇస్తూ కేసీఆర్ ఆదుకుంటున్నాడు. బావులకు, బోర్లకు మోటర్లు పెట్టి 24 గంటలు నడిపినా కూడా కరెంట్ ఎక్కువ తక్కువలు లేకుండా మో టర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ఏర్పాట్లు చేసి తొమ్మిదేండ్లుగా మంచి కరెంట్ అందిస్తున్నది.
కాంగ్రెస్ పాలనలో ఉచిత విద్యుత్తు అని చెప్పినా వాస్తవ పరిస్థితి ఎలా ఉండేది?
అనంతరెడ్డి: అర్ధరాత్రి, అపరాత్రి ఉచిత కరెం ట్ రైతులకు ఇచ్చే వారు. సాగుకు 6 గంటలే ఇచ్చేటోళ్లు. అది కూడా మధ్య మధ్యలో కటింగ్‌లు అయ్యేటివి. బాయిల కాడ, చెట్ల కింద పండుకొని మోటర్లు ఆన్ చేసుకునే వాళ్ళం. అర్థరాత్రి 3గంటలకు కరెంట్ ఇస్తే దాని కోసం ఎదురు చూసేటోళ్ళం. తెలందాక బాయి కాడ పండుకునేవాళ్లం.
గతంలో బోర్లు, ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి ఏమిటి?
అనంతరెడ్డి: కాంగ్రెసోళ్లు ఉచిత కరెంట్ పేరుతో ఊకె కోతలు విధించే వారు. ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువగా బిగించకపోవడంతో లో ఓల్టేజీతో మోటర్లు, పంపు సెట్లు ఎప్పుడూ కాలిపోయేటివి. ట్రాన్స్ఫార్మర్లు కూడా అనుకున్న మేర ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయకపోవడంతో రెండు, మూడు నెలలకు ఒక సారి కాలిపోయేవి. రైతులందరం కలిసి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో ట్రాన్స్ఫార్మర్లను ములుగు సబ్ స్టేషన్ తీసుకువచ్చి కావలి కాసి రిపేరు చేయించుకొని మనిషిన్ని పైసలు జమ చేసి ఖర్చుల కింద ట్రాన్స్ఫార్మర్లను రిపేరు చేయించుకొని గద్దెలపై మాకు మేమే పెట్టుకునేవాళ్లం. ఏటా మోటర్లు కాలిపోతే వైండింగ్ చేయించేందుకు పైసలు అయ్యేవి. కరెంట్ బిల్లు కట్టె మందం మోటర్ల రిపేరుకు ఖర్చులు అయ్యేటివి.
కేసీఆర్ పాలనలో పరిస్థితి ఎలా మారింది?
అనంతరెడ్డి: కాంగ్రెస్ అప్పట్ల ఇచ్చిన కరెంట్‌కు.. కేసీఆర్ ఇస్తున్న కరెంట్‌కు శాన తేడా ఉంది. తొమ్మిదేండ్లుగా ఉచిత కరెంట్‌తో రైతులకు ఢోకా లేకుండా ఉంది. గతంలో లెక్క కరెంట్ కోతలు ఉండటం లేదు. ట్రాన్స్ఫార్మర్లు తగినన్ని ఏర్పాటు చేయడంతో లో ఓల్టేజ్ సమస్య తీరింది. సబ్స్టేషన్లు కూడా నిర్మించడంతో అడిగిన అందరి రైతులకు విద్యుత్ అధికారులు కనెక్షన్లు ఇస్తున్నారు. అధికారుల్లో జవాబుదారి తనం కూడా పెరిగి సమస్యలను వెంటనే పరిష్కరిస్తాన్రు.
కాంగ్రెస్ పాలనలో ఎన్ని ఎకరాలు సాగు చేసే వారు.. ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు?
అనంతరెడ్డి: కాంగ్రెస్ పాలనలో మా తాతలు, తండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారు. నేను కూడా కాంగ్రెస్, టీడీపీ పాలనలో సాగు చేశా. అప్పుడు రెండు ఎకరాల వరి, రెండు ఎకరాల పత్తి పండించేవాడిని. ఇప్పుడు గత తొమ్మిదేండ్లుగా ఆరు ఎకరాలలో వరి, పత్తి, మిర్చి పండిస్తున్నాను. నాలుగు మోటర్లతో ఫామ్ఫండ్లను నింపుకొని 24గంటలు మోటర్లు నడిపిస్తూ పంటకు పారించుకుంటున్నా.
ఎకరానికి నీరు పారించేందుకు రేవంత్ చెప్పినట్టు గంట సమయం సరిపోతుందా?
అనంతరెడ్డి: ఎకరం నీరు పారాలంటే నిండు వర్షాకాలంలో నాటు పెట్టే పొలంలో మూడించుల మోటర్తో పారిచ్చినట్లయితే 3 గంటల టైం పడుతుంది. రేవంత్‌రెడ్డి చెప్పినట్లు గంట అసలే సరిపోదు. ఆయన తెలిసి మాట్లాడిండో, తెలువక మాట్లాడిండో అర్థమైతలేదు. ఆయన అన్నట్టు గంట టైంలో ఒక్క దొయ్య కూడా పారదు. మూడు గంటల కరెంట్ అంటే వ్యవసాయం బంద్ చేసుకొని వేరే ఊరికి రైతులు వలస వెళ్లి బతుకుడే ఉంటుంది.
ఏయే భూములకు ఎంతెంత టైం పడుతుంది?
అనంతరెడ్డి: వానకాలంలో వరి పొలానికి నీళ్లు పెట్టాలంటే ఎకరాన మూడు గంటల సమయం పడుతుంది. అదికూడా వర్షానికి పొలం తడిసి నిండా నీళ్లు ఉంటేనే. యాసంగి సీజన్లో ఎకరానికి 4గంటల సమయం పడుతుంది. అది కూడా బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉంటేనే పొలం పారుతుంది. లేకుంటే ఇంకింత టైం పడుతుంది. పత్తికి, మిర్చికి, మక్కజొన్నకు ఎకరం పారించాలంటే కూడా మూడు గంటల టైం కచ్చితంగా పడుతుంది. గంట సేపట్ల ఎకరం పారుతుంది అనేది ఉట్టి ముచ్చటే.
3 గంటల కరెంట్‌తో సాగు సాధ్యమా?
అనంతరెడ్డి: రోజుకు మూడు గంటల కరెంట్ ఇస్తే వ్యవసాయం బంద్ పెట్టుడే నయం. రైతులు అనేవాళ్లు ఇబ్బందులు పడుకుంటా వ్యవసాయం చేసుకునే దానికంటే కూలి పని చేసుకొని బతుకే నయం. మూడు గంటల కరెంటే గనుక ఇచ్చినట్లు అయితే అప్పటి లెక్క వ్యవసాయం చేయలేం. ఈ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు లేకుండా ఇబ్బంగా వ్యవసాయం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అన్నట్లు మూడు గంటల కరెంట్ ఇత్తే వ్యవసాయం చేసేవాళ్లు తగ్గిపోతారు.
కాంగ్రెస్ ఉచిత విద్యుత్తును నమ్ముతారా?
అనంతరెడ్డి: వైఎస్ ఉన్నప్పుడు కరెంట్ ఇస్తానని అటో ఇటో ఇచ్చిండు. ఇప్పుడు అటువంటి నాయకుడు కాంగ్రెస్‌లో లేడు. కాంగ్రెసోళ్లు అధికారంలోకి రానేరారు. వచ్చినా ఫ్రీ కరెంట్ ఇస్తారనే నమ్మకమై తే నాకు లేదు. కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు ఉన్నారని అనుకుంటలేను. ముఖ్యంగా రైతులు అసలే లేరు. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలలో ఉన్న నాయకుల్లో ఎంతో మంది రైతులుగా సాగు చేసే వాళ్లు ఉన్నారు. వాళ్లు కూడా ఆ పార్టీ నాయకుల మాటలను విని ఓట్లు వేస్తరని నేను అనుకుంట లేను.