హైదరాబాద్, జనవరి 12(నమస్తే తెలంగాణ): భూభారతి (ధరణి) పోర్టల్‌లో నమోదై, వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. రైతు భరోసా పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఈ నెల 10న జీవో ఆర్టీ నంబర్ 18 జారీ చేశారు. అయితే, ప్రభుత్వం వెంటనే ఈ ఉత్తర్వులను వెబ్సైట్లో పెట్టకపోవడం గమనార్హం. రెండు రోజుల తర్వాత ఆదివారం వీటిని బహిర్గతం చేసింది. రైతు భరోసా పథకం అమలు బాధ్యతను వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కు అప్పగించింది. జిల్లాల్లో మాత్రం పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కార బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది.
రైతు భరోసా పథకం కింద పంటల పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఎకరాకు రూ.12 వేలకు పెంచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. వాస్తవానికి, ఎకరాకు 15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల మ్యా నిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆరు గ్యారెంటీల్లోనూ పేర్కొన్నది.