Rythu Bharosa | హైదరాబాద్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ): రైతుభరోసా కాస్తా లీకుల భరోసాగా మారిపోయింది. రైతుభరోసా ఇప్పుడు, అప్పుడు అంటూ సర్కార్ నుంచి లీకులే తప్ప.. రైతులకు పైసలు మాత్రం జమ చేయడం లేదు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న రైతు ఓటర్లను మభ్యపెట్టేందుకు రైతుభరోసాపై లీకుల అస్ర్తాన్ని సర్కార్ ఎంచుకున్నదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సీఎంవో, సర్కార్ పెద్దల
నుంచి వంత పత్రికలు, చానళ్లకు త్వరలోనే రైతుభరోసా అంటూ లీకులు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ సోషల్ మీడియాలోనూ దీనిపై ప్రచారం చేశారు. ‘దున్నపోతు ఈనింది అంటే.. దూడను కట్టేయండి’ అన్నట్టుగా ఎన్నికలు పూర్తికాగానే రైతుభరోసా జమ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పడమే ఆల స్యం.. కాంగ్రెస్ వంత పత్రికలు, పచ్చ పత్రికలు రైతుభరోసా పంపిణీకి రంగం సిద్ధమైందంటూ వార్తలు ప్రత్యక్షమయ్యాయి.
అంధజ్యోతి పత్రికైతే, ‘ఈ నెల 17నుంచే రైతుభరో సా’ అంటూ ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా వార్త ప్రచురించింది. 17వ తేదీ ముగిసినా అంధజ్యోతి చెప్పినట్టు రైతుభరోసా కింద పైసా జమ కాలేదు. రైతుభరోసాకు ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.9వేల కోట్ల రుణం కూడా తీసుకున్నదని రాసుకొచ్చింది. ఈ సీజన్లో ఎలాంటి కోతలు లేకుండా సాగు భూములన్నింటికీ రైతుభరోసా జమచేస్తుందని కూడా ప్రచురించింది. ఇతర వంత పత్రికలు, టీవీ లు, పెయిడ్ యూట్యూబ్ చానళ్లు కూడా రేపోమాపో రైతుభరోసా అంటూ హడావుడి చేశా యి. ఇలా ఆ పత్రిక అధికార పార్టీకి ఎన్నికల్లో లబ్ధిచేకూరేలా వార్తలు రాసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్టుగా మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి, అంధజ్యోతి చెప్పినట్టుగా 17వ తేదీ కూడా వెళ్లిపోయింది. కానీ, రైతుభరోసా రాలేదు. ఎప్పుడు ఇస్తుందో కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన లేదు. వాస్తవానికి ఇప్పటికే యాసంగి సాగు ముగింపున కు చేరింది. రైతులు రైతుభరోసా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పెట్టుబడి కోసం వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకొస్తున్న పరిస్థితి ఏర్పడింది. రైతులు ఇంతలా ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వానికి పట్టింపులేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల పర్వం ముగిసిన నేపథ్యంలో, ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ (పరిషత్) ఎన్నికలు ఇప్పట్లో ఉంటే తప్ప యాసంగి రైతుభరోసా జమ చేయరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేకపోతే, అనవసరంగా రైతులకు రూ.9వేల కోట్లు ఇవ్వడమెందుకనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే త్వరలోనే రైతుభరోసా అందిస్తుందని, లేనిపక్షంలో రైతులకు నిరాశే మిగులుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.