Rythu Bharosa | హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకోవాలన్న క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయంపై రైతులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. గత ఆరేండ్లుగా లేనిది ఇప్పుడు కొత్తగా దరఖాస్తు తీసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వద్ద భూముల వివరాలు, పంటల సాగు వివరాలు ఉన్నప్పటికీ, మళ్లీ ఈ ప్రహసనం ఎందుకనే చర్చ జరుగుతున్నది. ఫైనల్గా రైతు భరోసాను దరఖాస్తు ఆధారంగా ఇస్తారా? లేక ప్రభుత్వం చేసే పంటల సర్వే ఆధారంగా ఇస్తారా? ఏదో ఒకటి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి, సాగు భూముల లెక్కల కోసం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏఈవోల ద్వారా పంటల నమోదు సర్వే చేయిస్తున్నది. దీంతోపాటు కాంగ్రెస్ సర్కారు ప్రత్యేకంగా శాటిలైట్ సర్వే కూడా చేయించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాటిలైట్ సర్వే కంపెనీలతో సమీక్ష కూడా నిర్వహించారు. ఈ రెండు విధానాల్లో ఎలాగూ సాగు లెక్కలు తెలిసిపోతాయి. అలాంటప్పుడు మళ్లీ రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని, పంటల వివరాలు తీసుకోవడంలో అర్థం లేదనే వాదన వినిపిస్తున్నది.
ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు రైతు భరోసా కోసం గ్రామాల్లో దరఖాస్తు తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. పంట సాగు చేసినప్పటికీ ఒకవేళ ఏదైనా కారణంతో దరఖాస్తు చేయకపోతే ఆ రైతులకు రైతు భరోసా ఇవ్వరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు మూడు రోజులు మాత్రమే. ఊళ్లో ఎకరమో, అర ఎకరమో భూమి ఉండి.. పట్టణాల్లో చిరుద్యోగాలో, చిన్నచిన్న వ్యాపారాలో చేసుకుంటున్నవారి సంఖ్య భారీగానే ఉంటుంది. చాలామంది రైతులు పెండ్లి అయి అత్తగారి ఇంటికి వెళ్లిన తమ ఆడబిడ్డలకు పసుపు-కుంకుమ, పుట్టింటి కట్నం కింద ఎకరమో, అర ఎకరమో భూములు రాసి ఇస్తారు. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వలసలు, ఇతర దేశాలకు వెళ్లిన వారూ ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో సాధారంగా ఇంటి వద్ద ఉన్న కుటుంబసభ్యులే ఆయా భూముల వ్యవహారాలు చూస్తుంటారు.
ఇప్పుడు వీరంతా గ్రామాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవడమంటే వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. ఉదాహరణకు హైదరాబాద్లో ఉంటున్న ఒక ఆడబిడ్డకు తన స్వగ్రామంలో అర ఎకరం పొలం ఉన్నదనుకుంటే, ఆమెకు రైతు భరోసా కింద సుమారు రూ.మూడు వేలు వస్తుంది. కానీ, ఇప్పుడు ఆమె తమ గ్రామానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవడానికి రూ.వెయ్యో, పదిహేను వందలో ప్రయాణ చార్జీల కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బడుగు, బలహీనవర్గాల రైతులను కూడా ఇబ్బంది పెట్టేవిధంగా ‘దరఖాస్తు’ అనే ఒక మూర్ఖపు నిర్ణయం క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు తీసుకున్నదో ఎవరికీ అంతుచిక్కదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ పథకంలో ఏ విధంగా కోతలు పెట్టాలనే ఆలోచన చేస్తున్నది. రైతుబంధులోనూ కోతలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. రైతుభరోసా పేరుతో కోతలకు సిద్ధమైంది. ఈ కోతలకు రైతులనే కారణంగా చూపే ఎత్తుగడ వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తులో రైతుల నుంచి భూముల వివరాలు, పంట సాగు వివరాలు తీసుకోనున్నారు. ఆ వివరాల మేరకు రైతు భరోసా అందించనున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. రైతులు ఇచ్చిన దరఖాస్తు ప్రకారమే సాగైన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించామనే వాదన ప్రభుత్వం లేవనెత్తే అవకాశం ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకోవాలనే ప్రభుత్వం ఉద్దేశం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోతలు పెట్టేందుకే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దరఖాస్తులకు సాగు భూమికి మాత్రమే ఇస్తామనే షరతు పెట్టనున్నది. ఈ లెక్కన బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుడు 3.05 కోట్ల ఎకరాలకు రైతుభరోసా ఇవ్వగా, కాంగ్రెస్ సర్కారు దీనిని 2 కోట్ల ఎకరాలకు తగ్గించే అవకాశాలున్నాయి. ఈ లెక్కన మొత్తం ఏడాదిలో సుమారు కోటి ఎకరాలకు రైతుభరోసా కోతపెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది.