హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ఈ వానకాలం సీజన్లోనూ పాత పద్ధతిలోనే పెట్టుబడి సాయం (రైతుబంధు) పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. రైతుభరోసా మార్గదర్శకాల రూపకల్పనలో ఆలస్యమే ఇందుకు కారణమనే చర్చ వ్యవసాయశాఖలో జరుగుతున్నది. ఇప్పటికే వ్యవసాయ సీజన్ మొదలైంది. వర్షాలు కురుస్తుండటంతో రైతులు సాగు పనులు మొదలుపెట్టారు. దీంతో పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జూన్ నెలాఖరు నుంచే రైతుబంధు పంపిణీ మొదలుపెట్టేది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా లేదు. దీంతో తమ పట్ల రైతుల్లో వ్యతిరేకత మరింత పెరుగుతుందనే ఆందోళన ప్రభుత్వంలో నెలకొన్నది. ఈ నేపథ్యంలో వానకాలం సీజన్‌కు రైతుబంధు (రైతుభరోసా) పంపిణీపై ఏమి చేయాలని ఆలోచిస్తున్నది. ఇందులో భాగంగా పలు ప్రతిపాదనలు తెరపైకి వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. రైతుల నుంచి డిమాండ్ పెరిగితే.. తొలుత ఎకరాకు రూ.5 వేల చొప్పున అందజేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. రైతుభరోసా విధివిధానాలు ఖరారైన తరువాత అర్హులైన రైతులకు మరో రూ.2,500 చొప్పున ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనే దానిపై కూడా వ్యవసాయ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీనిని రైతులు ఏ మేరకు ఆమోదిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సీజన్ ఆరంభంలో రైతులకు పెట్టుబడి గోస తీర్చడం, సాగు విస్తీర్ణంతోపాటు వ్యవసాయ ఉత్పత్తి, ఉద్పాకత పెంచాలనే ఉదాత్త లక్ష్యాలతో కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలుచేసింది. ఈ ఆశయానికి అనుగుణంగా ఎకరాకు సీజన్‌కు రూ.5 వేల చొప్పున, ఏడాదికి రూ.10 వేలు పెట్టుబడి సాయంగా రైతులందరి ఖాతాల్లో జమ చేసేది. తాము అధికారంలోకి వస్తే రైతుభరోసా పేరుతో ఈ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత యాసంగి సీజన్లో ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది. తాము కొత్తగా అధికారంలోకి వచ్చినందున ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే రైతుబంధు ఇచ్చి, వానకాలం సీజన్ నుంచి రైతుభరోసా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతుభరోసా విధివిధానాలపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి అప్పుడే స్పష్టంచేశారు. అయితే, అసెంబ్లీలో ఎప్పుడు చర్చిస్తారు? ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. మరోవైపు, రైతుభరోసా విధి విధానాల రూపకల్పనకు ఇప్పటివరకు కనీస కార్యాచరణ కూడా మొదలుకాలేదు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.
వ్యవసాయ సీజన్ మొదలుకావడంతో రైతులు సాగు పనుల్లో బీజీగా ఉన్నారు. రైతుబంధు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సకాలంలో పెట్టుబడి సాయం అందితే, విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఇబ్బంది ఉండదని ఆశ పడుతున్నారు. పెట్టుబడి సాయం పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. మొన్నటి యాసంగి మాదిరిగానే ఈసారి కూడా ఆలస్యం చేస్తారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి యాసంగిలో పెట్టుబడి సాయం పంపిణీని డిసెంబర్ 9న మొదలు పెట్టి మే 8వ తేదీతో పూర్తి చేసింది. సాగు సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని పంటలు కోసిన తర్వాత అందించడం గమనార్హం. సకాలంలో పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు అప్పుల కోసం మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులను, షావుకార్లను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురిస్తున్నది.