జనగామ, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఈ చిత్రంలో పొలం దగ్గర అన్నం తింటున్న దంపతులు కొర్ర శంకర్‌నాయక్, లలిత. స్వగ్రామం జనగామ జిల్లా గానుగపహాడ్ శివారు కొర్రతండా. ఆయన పేరుపై 2.20 గుంటలు, భార్య పేరిట 13 గుంటలు మొత్తం 2 ఎకరాల 13 గుంటలు ఉన్నది. ఐదారేండ్ల క్రితం రాళ్లురప్పలతో పడావు పడి ఉండేది. పంట పండిద్దామంటే నీళ్ల వసతి లేదు. ఏం చేయాలో తోచక భార్యాబిడ్డలతో హైదరాబాద్‌కు వలస వచ్చి చర్లపల్లిలో ఓ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించాడు.
పట్నంలో ఎన్నిరోజులు ఉన్నా ఊరిపై ఆయనకు తీవ్ర మమకారం ఉండేది. ఎప్పుడైనా సరే ఊళ్లనే బతకాలని అనుకొన్నాడు. ‘శంకర్..కేసీఆర్ మన ఊరికి నీళ్లు తెచ్చిండు.. కొర్రతండలో నీకు రెండెకరాలున్నది కదా.. ఇక్కడే బతుకొచ్చు’ అని గ్రామస్తులు చెప్పడంతో మనసు ఉప్పొంగింది. నిజమో.. కాదో అని తెలుసుకొనేందుకు ఆయన స్వయంగా వచ్చి చూడగా బొమ్మకూరు రిజర్వాయర్ నిండి ఊళ్లోకి నీళ్లు వచ్చాయి.
ఆయన కండ్లల్లో ఆనందం కలిగింది. ఎలాగైనా ఊరిలోనే వ్యవసాయం చేసుకొని బతకాలని రెండేండ్ల కిందట భార్యాబిడ్డలతో స్వగ్రామానికి మకాం మార్చాడు. నీళ్లు రావడంతోపాటు ఏటా రెండుసార్లు రైతుబంధు పైసలు పడుతుండటంతో దర్జాగా వ్యవసాయం చేసుకొంటూ బతుకుతున్నాడు. ‘తెలంగాణ రాక మునుపు బతుకుదెరువు లేదు. ఎండాకాలం వస్తే మస్తు ఇబ్బందులు పడేటోళ్లం. నీళ్లకు అరిగోస తీసినం. గొడ్లు నీళ్ల కోసం గోలాల కాడ కొట్లాడుకుంటుంటే పానాలు అవిసిపోయేది. గంట మోటరు నడిసినా గోలెం నిండకపోయేది.
ఇపుడు పానం నిమ్మలమైంది. వద్దంటే నీళ్లొస్తున్నవి. గోదావరి నీళ్లతో చెరువులు నిండుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడిలా నిలిచిండు. దేవాదుల నీళ్లతో మా బతుకుల్ని మారుస్తున్నరు. ఫుల్లుగా నీళ్లు..టైంకు పంట పెట్టుబడికి కేసీఆర్ పైసలు అందుతున్నయి. 24గంటల ఫ్రీ కరెంటు ఇత్తాండ్లు. యాసంగి, వానకాలం.. వీలైతే ఎడగారు (ఎరగాలు) మూడు పంటలు వరి వేస్తున్న. రెండుకార్లకు ఢోకా లేదు. ఇప్పుడు మనసు నిమ్మలమైంది. మస్తు పనులు దొరుకుతున్నయి. ఇంతకంటే ఏం కావాలి’ అని శంకర్‌నాయక్ ఆనందం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సార్ సల్లగుండాలె
నేను మొదటి నుంచి వ్యవసాయమే చేస్తున్న. రెండున్నర ఎకరాల భూమి ఉన్నది. కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.12,500 బ్యాంక్ ఖాతాలో జమైనయి. యాసంగిలో ఇప్పటికే పొలం పనులు ప్రారంభించిన. వచ్చిన పైసలతో దున్నకాలకు చెల్లించిన. ఇంకా కొన్ని డబ్బులు మిగలడంతో ఎరువులు కొంటా. గతంలో పంట కోసం పైసలు మిత్తీలకు తెచ్చేటోళ్లం. ఇప్పుడు రైతుబంధుతో ఆ రంది తీరింది. ఏటా ఎకరానికి రూ.10 వేల సాయం చేస్తూ కేసీఆర్ పేదోళ్లకు ఎంతో మేలు చేస్తుండు. నా జీవితంలో ఇప్పటిదాకా ఇట్ల రైతుల గోడును పట్టించుకున్న ప్రభుత్వాన్ని చూడలె. దేశంలో ఏడనన్న ఇట్ల ఇస్తుండ్రా? కేసీఆర్ సార్ సల్లగుండాలె.
-బోడకుట్ల నర్సిరెడ్డి, సంగెం, వలిగొండ మండలం, యాదాద్రి జిల్లా
రైతుల దశ మారింది
నాకు 4 ఎకరాల పొలం ఉన్నది. కూరగాయలు, వరి, చెరుకు, ఉల్లిగడ్డ, పత్తి సాగు చేస్తున్న. సీఎం కేసీఆర్ వచ్చాక రైతుల దశ మారింది. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం రెండుసార్లు ఇస్తున్నారు. ట్రాక్టర్ కిరాయిలు, విత్తనాలు, మందులు, యూరియా కొనుగోలుకు అక్కరకు వస్తున్నాయి. కూలీలకు రైతుబంధు డబ్బులను ఖర్చు చేస్తున్న. సమయానికి చేతిలో పైసలు ఉండటంతో అప్పులు చేయాల్సిన బాధ లేకుండా పోయింది. ఏటా సాగు చేస్తుండటంతో పంటల దిగుబడి పెరిగి పైసలు మిగులుతున్నయి. రైతులకు అండగా ఉంటున్న కేసీఆర్ సార్ దేవుడు. రైతుబంధు, ఉచిత విద్యుత్తు, రైతుబీమా పథకాలు మాలాంటోళ్ల పాలిట వరంలా మారినయి.
-గుండు జగన్మోహన్, చింతపల్లి, సంగారెడ్డి జిల్లా
కేసీఆర్ సారును మరువం
నాకు రెండెకరాల పొలం ఉన్నది. ఈ యాసంగికి సీఎం కేసీఅర్ సార్ నా ఖాతాల రూ.10,000 రైతుబంధు డబ్బులు ఏసిండు. వాటితో ఎరువులు తెచ్చిన. రైతుబంధు అస్తుండటంతో పైసలకు తక్లీబ్ అయిత లేదు. వడ్డీ వ్యాపారుల బాధలు తప్పాయి. రైతుబంధు, రైతుబీమా తెచ్చిన కేసీఅర్ సారును మరువం. గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు. తెలంగాణ అచ్చినంక రైతులకు చానా మంచి జరుగుతున్నది. తెలంగాణ రాక మునుపు పంట లాగోడికి చానా తిప్పలవుతుండే. కరెంట్‌తోని చానా ప్రాబ్లమ్ అవుతుండే. ఎరువులకు లైన్ల చెప్పులు పెట్టి నిలుచుండే వాళ్లం. ఎరువులు, విత్త్తనాలకు లైన్ కట్టినా దొరికేటివి కావు. నేడు ఎరువుల గోస లేదు. రైతులకు అండగా ఉన్న ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు రక్ష. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
-దారం హరీశ్, రైతు, గుర్రాలగొంది,సిద్దిపేట జిల్లా
కైకిలోళ్లు ఊరికొస్తున్నరు
గతంల పంటేసుండంటే ఏడుపొచ్చేది. కరంటు క్షణంల గిట్లచ్చి అట్ల పోయేది. మళ్లీ ఎదురు సూపులే మిగిలేవి. బోర్లు వందల ఫీట్లు వేసినా సుక్క నీరు పడకపోయేది. పైసలన్ని వృథా అయ్యేవి. మళ్ల మళ్ల బోర్లేసేది. నీరు పడితే దేవుడి దయ అనుకునేది. ఉన్న మూడు ఎకరాల భూమిని పొద్దనక, రాత్రనక సాగు చేస్తే పొట్టకు మిగలకపోయేది. అన్ని అప్పులే అయ్యేటివి. కేసీఆర్ సార్ దేవుడోలే వచ్చిండు. మా రాజన్న సిరిసిల్ల వాగులో గిన్ని నీళ్లు ఎన్నడు సూడలేదు. యాసంగి, వానకాలంలో కరంటు పోవుడన్నదే లేదు. ఇగ రైతుబంధు పైసలు పదిసార్ల తీసుకున్న. కేసీఆర్ పైసలతోటి దున్నడానికి ట్రాక్టర్ కిరాయి, కూలీలకు ఇస్తున్నం. ఇప్పుడు కైకిలోళ్లు దున్నడానికి రమ్మంటవా అని అడుగుతున్నరు.
-కన్నె భాగ్యలక్ష్మి, తాడూరు(పాపయ్యపల్లె), రాజన్న సిరిసిల్ల జిల్లా
క్యారెట్, పూల సాగు చేస్తున్న
రైతుబంధు డబ్బులతో పంటలకు లాగోడి కోసం తిప్పలు పోయనయి. ఏడాదిలో రెండుసార్లు పైసలు ఇస్తుండ్రు. పొలంలో అస్పరగ్రాస్ సాగుతో పాటు క్యారెట్, పూలసాగు చేస్తున్నా. ఎరువుల కొనుగోలు, కూలీల ఖర్చులకు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. గతంలో ఏ ప్రభుత్వాలు ఇటువంటి మంచి పథకాలు అమలు చేయలేదు. రైతుబిడ్డగా, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం మంచి పథకాలు అమలు చేయడం గొప్ప విషయం. ఎవుసానికి నిరంతర కరెంట్ ఇస్తూ, పంటకు లాగోడి సాయం అందిస్తూ, పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించడం మామూలు విషయం కాదు.
-సామ ప్రతాప్‌రెడ్డి, ఎర్రోనిగూడ, షాబాద్ మండలం, రంగారెడ్డిజిల్లా
యాసంగి @ 20 లక్షల ఎకరాలు
అత్యధికంగా 10.45 లక్షల ఎకరాల్లో వరి
ఆ తర్వాత పత్తి, శనగ, వేరుశనగ పంటలు
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. ప్రాజెక్టుల్లో నీళ్లు పుష్కలంగా ఉండటం, చెరువులన్నీ నిండుకుండల్లా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా యాసంగి జోరుగా సాగుతున్నది. ఇప్పటివరకు అన్ని రకాల పంటలు కలిపి 20 లక్షల ఎకరాల్లో సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 10.45 లక్షల ఎకరాల్లో వరి, శనగ 3.83 లక్షల ఎకరాలు, వేరుశనగ 1.97 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 2.73 లక్షల ఎకరాల్లో సాగు అయినట్టు పేర్కొన్నది.
దండగ కాదు.. పండుగ
అన్నదాతల పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు ఎంతో ఆసరా అవుతున్నది. అప్పుల పాలుకాకుండా, మిత్తీలు తెచ్చే బాధ లేకుండా కాపాడుతున్నది. వారం రోజులుగా బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు పైసలు పడుతుండటంతో రైతులు ఉత్సాహంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. నాడు దండుగ అనుకొన్న ఎవుసం ఇవ్వాళ పండుగ అయ్యిందని సంబురపడుతూ బుధవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గోపాలపూర్‌లో మంత్రి కేటీఆర్ పేరుతో వరినారు పేర్చిన రైతులు.
-కమలాపూర్, జనవరి 4
రైతుబంధు సాయం గొప్పది
గతంలో ఎవుసం చేసేందుకు నీళ్లు ఉండేవి కాదు. ఒకవేళ నీళ్లు ఉంటే ఎరువులు, విత్తనాలు దొరకకుండే. అవి ఎప్పుడో ఒకప్పుడు దొరికినా దున్ని, నాటేసేందుకు డబ్బులు లేక అవస్థలు పడేటోళ్లం. కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయినంక సరిపడా నీళ్లు వస్తున్నవి. ఎరువులు, విత్తనాలకు కొదవ లేదు. నాకు ఎకరం ఐదు గుంటల భూమి ఉన్నది. రైతుబంధు కింద రూ.5,725 జమైనయి. రైతులకు చేస్తున్న సాయం చాలా గొప్పది.
-ఆంజనేయులు, మూసాపేట, మహబూబ్‌నగర్ జిల్లా
వ్యవసాయం పండుగైంది
గత ప్రభుత్వాల పాలకులు వ్యవసాయం దండగ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయంపై పూర్తిస్థాయి దృష్టి సారించి నిమిషం కూడా పోకుండా కరెంట్ ఇస్తున్నారు. నాకు ఉన్న ఐదెకరాల పొలంలో రెండు పంటలు పడిస్తున్నా. పంటల పెట్టుబడి కోసం అప్పులకు తిరుగుడు తప్పింది. పంటలకు ముందే పెట్టుబడి సాయాన్ని సీఎం సారు అందిస్తున్నారు. దీంతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. గతంలో వ్యవసాయం అంటేనే అప్పుల పాలయ్యేవాళ్లం. తెలంగాణలో నేడు ఆ పరిస్థితి లేకుండా రైతు రాజుగా బతుకుతున్నాడు.
-దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి, రేజర్ల, సత్తుపల్లి మండలం, ఖమ్మం జిల్లా