కొత్తగా ఎన్నికవుతున్న సర్పంచ్‌లు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునే ప్రణాళికలు రచించుకోవాలె. గంగదేవిపల్లె లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలె. ప్రజల భాగస్వామ్యంతో కమిటీ వేసుకొని అభివృద్ధికి పాటుపడాలి. ఎవరో ఏదో చేస్తారని.. ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దు.
సార్!.. మీ పాలన పల్లెలకు స్వర్ణయుగం. ఇప్పుడేమున్నది? కనీస వసతుల్లేక పల్లెలు గొల్లుమంటున్నయ్. ఏదైనా పోగొట్టుకున్నంకనే విలువ తెలిసివస్తది. మీరున్నప్పుడు తెలువలేదు. ఇప్పుడు అర్థమైతున్నది. సార్.. మళ్లా మీరొస్తేనే తెలంగాణ పల్లెలకు మునుపటి కళ వస్తది. కాంగ్రెస్ పాలనను మేం కూడా రెండేండ్లే భరించాలె!
గజ్వేల్/మర్కూక్, డిసెంబర్ 5 : ‘మనకు అన్ని కాలాలు, పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కొన్నిసార్లు కష్టకాలం వస్తది.. అంతమాత్రాన వెరవద్దు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తది. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచిరోజులు వస్తయి. ఎవరూ అధైర్యపడొద్దు’ అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభయమిచ్చారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో శుక్రవారం తనను కలిసి ఆశీర్వాదం తీసుకొనేందుకు వచ్చిన ఎర్రవెల్లి, నర్సన్నపేట ఏకగ్రీవ సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. అందరూ కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడాలని, అప్పు డే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని, అందుకు గ్రామంలోని యువత, ప్రజలతో కమిటీలు వేసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాల సహకారం లేకున్నా గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలా గ్రామ కమిటీలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. పుష్కలంగా ఉన్న నీటి వనరులను పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలని, అప్పుడే వనరులు వృథా కాకుండా ఉంటాయని చెప్పారు. ఉన్నపాటి వనరులను కొత్తదనంతో అభివృద్ధి చేసుకునే దిశగా వినియోగించుకున్నప్పుడే గ్రామాల రూపురేఖలు మారుతాయని స్పష్టంచేశారు. గ్రామంలో జరిగే ప్రతి విషయాన్ని వీడీసీ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని, ప్రతిదీ చర్చకు వచ్చినప్పుడే సమష్టి నిర్ణయం మేరకు సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని సూచించారు. గ్రామాల్లో నేటికీ సామాజిక వివక్ష కొనసాగుతున్నదని, కులమతాలకు అతీతంగా స్థానిక నాయకత్వం ముందుండి సామరస్యంగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని తెలిపారు. గ్రామాల్లో ఉన్నోళ్లు లేనోళ్లకు సహకారం అందించి వారి బాగుకోసం కృషి చేసినప్పుడే గ్రామమంతా బాగుపడుతుందని చెప్పారు.
గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని కేసీఆర్ గుర్తుచేశారు. దళితులు, గిరిజనులు, బహుజనులు, మహిళలు, కులవృత్తులకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, గ్రామాల అభివృద్ధికి అమలు చేసిన పథకాలు, పల్లెప్రగతికి అందించిన ఆర్థిక సహకారం తెలంగాణ పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటునందించాయని వివరించారు. సీఎంగా తాను దార్శనికతతో చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. కొత్తగా ఎన్నికవుతున్న సర్పంచ్‌లు గొప్ప ఆలోచనలతో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. గంగదేవిపల్లె లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని, ప్రజల భాగస్వామ్యంతో కమిటీ వేసుకొని అభివృద్ధికి పాటుపడాలని చెప్పారు. ఎవరో ఏదో చేస్తారనో.. ఏదో ఇస్తారనో ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని హితవుపలికారు.

జాతీయ, అంతర్జాతీయంగా పల్లెల ప్రగతి కోసం గొప్పవ్యక్తులు చేసిన కృషి గురించి గ్రామస్తులకు కేసీఆర్ వివరించారు. బంగ్లాదేశ్‌కు చెందిన సామాజిక, ఆర్థికవేత్త, స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు స్ఫూర్తిదాత అయిన ప్రొఫెసర్ యూనస్, మన దేశానికి చెందిన అన్నా హజారేలాంటి దార్శనికుల కృషిని వివరించారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో పల్లెలను సామాజిక, ఆర్థిక, స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో వాతావరణం, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పండుతున్న పంటల గురించి గ్రామస్తులను పేరు పేరునా అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో గొప్పగా వర్ధిల్లిన గ్రామాలు, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా దిగజారాయని గ్రామస్థులు తెలుపుతూ ఆవేదన వ్యక్తంచేశారు. నాడు విద్యుత్తు, సాగునీరు సహా వ్యవసాయాభివృద్ధికి కేసీఆర్ సర్కారు అందించిన సహకారం, పల్లె ప్రగతికి క్రమం తప్పకుండా విడుదల చేసిన నిధులు, కులవృత్తులకు, సబ్బండవర్ణాలకు ప్రత్యేకంగా అమలు చేసిన పథకాలు, అందించిన ఆర్థికసాయాన్ని గుర్తుచేసుకున్నారు.
ఉన్న వనరులను కొత్తదనంతో అభివృద్ధి చేసుకునే దిశగా వినియోగించుకున్నప్పుడే గ్రామాల రూపురేఖలు మారుతయి. గ్రామ కమిటీలను నిర్లక్ష్యం చేయకుండా యువత, ప్రజలతో మమేకమై ముందుకు నడవాలి. ప్రతి విషయాన్ని వీడీసీ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. గ్రామంలో జరిగే ప్రతిదీ చర్చకు వస్తేనే సమష్టి నిర్ణయం మేరకు సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.
కేసీఆర్‌ను కలిసిన వారిలో ఓ గ్రామస్తుడు మాట్లాడుతూ ‘సార్.. మీ హయాంలో మా పల్లెలకు స్వర్ణయుగం..ఇప్పుడేమున్నది? కనీస వసతుల్లేక పల్లె జనం గొల్లుమంటున్నది. అన్ని కులాలు అరిగోస పడుతున్నయ్. ఏదైనా పోగొట్టుకున్నంకనే అర్థమైతది దాని విలువ.. మీరున్నప్పుడు తెలియలేదు మీ విలువ. ఇప్పుడు అర్థమైతున్నది. మళ్లా మీరొస్తే తప్ప తెలంగాణ పల్లెలకు మునుపటి కళ రాదు. మళ్లా మీరే రావాలె. వస్తారు.. కాంగ్రెస్ పాలన రెండేండ్లకే సరిపోయింది’ అంటూ ఆవేదన వెలిబుచ్చాడు.
గ్రామస్తుల ఆవేదన చూసి చలించిపోయిన కేసీఆర్.. వారికి ధైర్యం చెప్పారు. ‘అన్ని కాలాలు అనుకూలంగా ఉండయి.. కొన్నిసార్లు కష్టకాలం వస్తది.. వెరవద్దు.. మళ్లా మన ప్రభుత్వమే వస్తది.. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచిరోజులు వస్తయ్.. అప్పటిదాకా ఎవరూ అధైర్యపడొద్దు’ అని భరోసా ఇచ్చా రు. బీఆర్ఎస్ పాలనలో అందించిన స్ఫూర్తితో.. స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముం దుకునడవాలని హితబోధ చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గొప్ప ఆలోచనలతో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచించుకోవాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది.. స్వయం పాలిత కేంద్రాలుగా.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లినయ్. దళిత, గిరిజన, బహుజనులకు అందించిన ప్రోత్సాహం, గ్రామాల అభివృద్ధికి అమలు చేసిన పథకాలు, పల్లెప్రగతికి అందించిన ఆర్థికసాయం, తెలంగాణ పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటునందించినయ్. నేను దార్శనికతతో చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచినయ్.

మర్కూక్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల సర్పంచ్‌లుగా నారన్నగారి కవిత రామ్మోహన్‌రెడ్డి, గిల్క బాల నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు, వార్డుల సభ్యులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ధనలక్ష్మీ కృష్ణ, మాజీ సర్పంచ్‌లు భాగ్య బాలరాజు, కిష్టారెడ్డి, బాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ కరుణాకర్ పాల్గొన్నారు.
‘ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో మీరందించిన సహకారం చాలా గొప్పది. ఇంచు జాగను కూడా వదులుకోని ఈ రోజుల్లో సామూహికంగా నిర్మించిన ఇండ్లకు స్థలాలు ఇవ్వడంలో మీ త్యాగం చాలా గొప్పది’ అని కేసీఆర్ కొనియాడారు. గ్రామాలను 90 శాతం అభివృద్ధి చేసి లైన్ మీదికి తెచ్చామని, మిగిలిన 10 శాతం అభివృద్ధి పనులను పూర్తి చేసుకొనేందుకు కలిసికట్టుగా కదలాలని సూచించారు.