హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర శాసనసభను సరైన పద్ధతిలో నడపడం లేదని, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సభా నియమాలను, సమయపాలనను పాటించడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. బుధవారం మధ్యాహ్న భోజన విరామానంతరం అసెంబ్లీ మొదలయ్యాక మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో సభ వెలవెలబోయింది. ఒకానొక సమయంలో కేవలం ఒక్క మంత్రి మాత్రమే సభలో ఉన్నారు. అంతకు ముందు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే సభలో ఉన్నారు.
కొద్ది సేపటి తర్వాత శ్రీధర్‌బాబు వెళ్లిపోవడంతో మంత్రి పొంగులేటి మాత్రమే సభలో మిగిలిపోయారు. సీఎంతో సహా మిగిలిన 15 మంది మంత్రులెవరూ సభలో లేరు. ఒక దశలో మంత్రులెవరూ అసెంబ్లీలో లేకపోవడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభ నుంచి బయటకు వచ్చి చాంబర్లలో ఉన్న మంత్రులను సభలోకి రావాలని పిలిచారు. కాగా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం మంత్రుల బాటలోనే నడిచా రు. ఒక కేవలం 19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ఉన్నారు. దీంతో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.