వరంగల్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు ఘోరపరాభవమే ఎదురైంది. సర్పంచ్ ఎన్నికల చరిత్రలో ఒక అధికార పార్టీ ఈ స్థాయిలో ప్రతికూల ఫలితాలను మూటగట్టుకోవడం ఇదే తొలిసారి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకే ప్రజలు మొగ్గుచూపడం ఆనవాయితీ. కానీ, ఇందుకు విరుద్ధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. నేలవిడిచి సాము చేస్తున్న రేవంత్ సర్కార్‌కు తెలంగాణ పల్లెలు చెంపపెట్టులాంటి సమాధానమిచ్చాయి. ‘గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచివాళ్లనే ఎన్నుకోండి. మంచివాళ్లను ఎన్నుకుంటే వాళ్లు మంత్రి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి నిధులు తెస్తరు. పల్లెల్లో పనులు చేస్తరు’ అని సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి ఓటర్లను వేడుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో మకాంవేసి ప్రజలను మచ్చిక చేసుకునేందుకు టక్కుటమార.. గజకర్ణ..గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించారు. రౌడీలను పెట్టించి గూండాయిజానికి పాల్పడ్డారు. పోలీసులను ఉసిగొల్పి కేసులపాలు చేస్తామని బెదిరించారు. కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు తెలంగాణ పల్లె తలవంచలేదు. మూడు విడతల్లో కలిపి కనీసం 50 శాతం గ్రామాలను కూడా సాధించలేకపోయింది.
మూడో విడతలోనూ భంగపాటు
గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి, రెండో విడతల ఫలితాలు నిరాశపరచడంతో మూడో విడత చేజారిపోకూడదని అటు గాంధీభవన్ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఇటు జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి క్షుద్రప్రయత్నాలన్నీ చేశారు. ‘మీరేం చేస్తారో తెలియదు. ఇప్పటికే రెండు విడతల్లో మీ నియోజకవర్గాల్లో ఫలితాలు సరిగా రాలేదు. కనీసం మూడో విడత అయినా రాకపోతే మంచిగుండదు’ అని హుకుం జారీ చేశారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో తిష్టవేశారు. ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఇల్లిల్లూ జల్లెడపట్టారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు తామే బరిలో ఉన్నామా? అన్నంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అయినా ఫలితం శూన్యమని తేలిపోయింది. మూడో విడత తీవ్ర ప్రయత్నం చేసినా చావుతప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఫలితాలు వచ్చాయి.
బెదిరింపులకు తలవంచని పల్లెలు
తమకు అనుకూలరీతిలో ఫలితాలు సాధించుకోవాలని కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను నేరుగా బెదిరింపులకు గురిచేశారు. తాము ప్రజాప్రతినిధులమనే విషయాన్ని మరిచి కొన్నిచోట్ల ప్రత్యక్ష బెదిరింపులకు పాల్పడ్డారు. ‘మేం చెప్పినవారు కాకుండా ఇతరులను గెలిపిస్తే ఆ సర్పంచ్‌లను నా క్యాంపు కార్యాలయం మెట్లు ఎక్కనీయ. ఒకవేళ వస్తే మెడపట్టి గెంటేస్తా’ అని ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అయితే ఏకంగా ‘బీఆర్ఎస్ అభ్యర్థులు అసలే గెలువొద్దు. ఒకవేళ గెలిచినా నేనే చంపేస్తా’ అని హెచ్చరించారు. ‘గెలిచిన సర్పంచ్‌లకు నిధులిచ్చేది కూడా నేనే. ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే నేనే సంతకం పెట్టాలి. రేషన్ కార్డులు కావాలంటే నేనే ఇయ్యాలి. కాంగ్రెస్ గెలిస్తేనే అన్నీ.. వేరేవాళ్లు గెలిస్తే పథకాలేవీ ఉండవు’ అన్న రీతిలో మైకులో పూనకం వచ్చినట్టు చిందులు తొక్కారు. పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తన సొంత ఊరిలో తాను నిలబెట్టిన అభ్యర్థి గెలువకపోతే తన పరువుపోతుందని గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకొని కూర్చుకున్నారు.
ప్రలోభాలు.. భయభ్రాంతులు
గెలిచితీరాలన్నంత కసితో కాంగ్రెస్ రెచ్చిపోయింది. ఇష్టారీతిగా ప్రలోభాల పర్వానికి తెరలేపింది. పట్టణాల్లోని ఓటర్లను పిలిపించుకున్నది. మార్గమధ్యంలోనే వారికి రాచమర్యాదలు చేసింది. రానుపోను తొవ్వ ఖర్చులిచ్చింది. కొన్నిచోట్ల వేలం పాడినట్టు ఓటుకు రూ.2 వేలు, రూ.2,500, రూ.3 వేలు అయినా సరే కొనిపారేయండి అంటూ లెక్కలేనితనాన్ని ప్రదర్శించింది. మాట వినరని తెలిసినచోట సొంత మనుషులను పంపి బెదిరింపులకు గురిచేసింది. పోలీసులను ఉసిగొల్పి కేసులు పెడ్తామని హూంకరించింది. పోలింగ్ ఎటమటం అవుతున్నదని గ్రహించి చాలాచోట్ల పోలీసులతో లాఠీచార్జీలు చేయించి భయభ్రాంతులకు గురిచేసింది.
ఇన్నిచేసినా ఫలితాలు తుస్సుమనిపించాయి. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు సహా గాంధీభవన్ పటాలమంతా పల్లెల్లో వాలిపోయింది. ఇటీవల నియమించిన పార్టీ జిల్లా అధ్యక్షులకు గాంధీభవన్‌లో సమావేశం ఏర్పాటు చేసి టార్గెట్ పెట్టింది. ‘మీ పనితీరుకు ఈ ఎన్నికలు గీటురాయి’ అంటూ కొత్త డీసీసీ అధ్యక్షులను రంగంలోకి దింపింది. ఎమ్మెల్యే సైన్యానికి తోడు కాంగ్రెస్ సైన్యాన్ని రంగంలోకి దింపింది. సీఎం నుంచి మంత్రుల దాకా, ఎమ్మెల్యేల నుంచి డీసీసీ అధ్యక్షుల దాకా, ఎమ్మెల్యేల ప్రైవేట్ సైన్యం నుంచి పోలీసుల దాకా పల్లెల మీద పడి ప్రజలను బెదిరింపులకు గురిచేసినా, ప్రత్యక్షదాడులకు పాల్పడినా కాంగ్రెస్‌పై గ్రామాలు తిరుగుబాటు బావుటా ఎగురవేశాయి.
సీఎం సభ పెట్టిన ఊర్లో ఎగిరిన గులాబీజెండా
స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసిన దాఖలా ఇప్పటిదాకా లేదు. కానీ, తన వాళ్ల మీద తనకు నమ్మకం లేనితనంతో రంగంలోకి దిగిన సీఎం రేవంత్‌రెడ్డికి వరంగల్ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. ఈనెల 5న నర్సంపేట నియోజకవర్గంలో ప్రజాపాలన విజయోత్సవాల పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే ‘మా వాళ్లను ఎన్నుకోండి. కాంగ్రెస్ వాళ్లను ఎన్నుకోండి’ అని ప్రత్యక్షంగా చెప్పకుండా ‘మంచివాళ్లను ఎన్నుకోండి. మంత్రి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి పోయేవాళ్లను ఎన్నుకుంటే మీకు మంచి పనులు అవుతాయి’ అని ప్రజలను వేడుకున్నంత పనిచేశారు. బుధవారం నర్సంపేట మండలంలోని రాజుపేటలో మూడో విడత ఎన్నికలు జరిగాయి. సీఎం సభ పెట్టిన ప్రాంతానికి కూతవేటు దూరంలో ఈ గ్రామం ఉన్నది. రాజుపేటలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బానోత్ అఖిల 321 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. సీఎం సభ పెట్టి, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే సహా కాంగ్రెస్ పటాలమంతా కలిసినా అక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం గమనార్హం.
బీఆర్ఎస్ అసాధారణ మెజారిటీకి ఆనవాళ్లు
కాంగ్రెస్ నేతలు ఎన్ని దారుణాలకు పాల్పడినా, గూండాగిరీ చేసినా పంచాయతీ ఎన్నికల చరిత్రలో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులు అత్యంత భారీ మెజారిటీని సొంతం చేసుకున్నారు. పరకాల నియోజకవర్గంలోని నడికూడ మండలం వరికోల్ గ్రామం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సొంతూరు. మొదటి నుంచీ ఈ గ్రామం బీఆర్ఎస్కు పెట్టనికోట. ఈసారి ఎలాగైనా వరికోల్‌లో జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేసింది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాలికిబలపం కట్టుకొని తిరిగారు. నాలుగైదు సార్లు ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి గానీ, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గానీ ఒక్కసారి కూడా ప్రచారానికి వెళ్లలేదు. గ్రామంలోని 12 వార్డులకు 10 వార్డులను బీఆర్ఎస్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ మెజారిటీతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కుమారస్వామి సర్పంచ్‌గా విజయబావుటా ఎగురవేశారు. మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపరచిన వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి 1,000 ఓట్లకు పైగా మెజారిటీ సాధించారు. మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని ఏటూరునాగారం పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో సీతక్క అనుచరుడిని ప్రజలు మట్టికరిపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలత 3,230 ఓట్ల రికార్డు మెజారిటీతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించింది. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో జనరల్ స్థానంలో దళిత మహిళ స్వప్నా భాస్కర్ 2,180 ఓట్ల మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పతనానికి ఇది నాంది: కేటీఆర్

సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అధికార పక్షానికి ఏకపక్షంగా ఉంటాయి. కానీ, ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకొని తిరిగినా, మంత్రులను మోహరించినా సగం సీట్లు సాధించడానికే తంటాలు పడ్డారు. అధికార పార్టీ ఇంత తకువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలు గెలువడం చరిత్రలో లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన జంగ్ సైరన్.’
ఇది సామాన్య విజయం కాదు.
చరిత్రలో నిలిచిపోయే పోరాటం. యుద్ధంలో సైనికుడిలా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకూ శిరస్సు వంచి సలాం చేస్తున్న. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతి గులాబీ సైనికుడి కండ్లల్లో కనిపించిన పౌరుషం పార్టీకి కొండంత బలాన్నిచ్చింది. పల్లెపోరులో అరాచక కాంగ్రెస్‌ను, రేవంత్‌రెడ్డిని మట్టికరిపించేందుకు మా శ్రేణులు చేసిన ఈ అలుపెరుగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది.
– కేటీఆర్
పాలక పార్టీని పొలిమేరకే కట్టడి చేశాయి పల్లెలు. విడత విడతకూ కాంగ్రెస్‌ను మడతపెట్టేశాయి. మొదటి, రెండో పంచాయతీ ఫలితాల్లో ముప్పుతిప్పలు పడిన కాంగ్రెస్ పార్టీకి.. తుది విడతలోనూ ముచ్చెమటలు తప్పలేదు. మండలాల బాధ్యతను ముఖ్యనేతలకు అప్పగించినా, ప్రలోభాలు పెంచినా, బెదిరించినా ఊరు వెరవలేదు. ఏకంగా ఎమ్మెల్యేలే పోలింగ్ కేంద్రాల వద్ద కుర్చీవేసుకుని మరీ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినా.. కాంగ్రెస్ వైపు ప్రజలు కనీసం చూడలేదు. మంత్రులు, ముఖ్య నేతల గ్రామాల్లో అధికార పార్టీకి పరాజయమే ఎదురైంది. సీఎం ప్రచారం చేసిన ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ ఓటమి పరాభవానికి పరాకాష్ఠ.
కాంగ్రెస్‌పై ప్రజావ్యతిరేకతకు సమాంతరంగా బీఆర్ఎస్పై అభిమానం తాజా ఫలితాల్లో వ్యక్తమైంది. కాళేశ్వరంపై సాగించిన కుట్రలను పటాపంచలు చేస్తూ ఆ గ్రామంలో బీఆర్ఎస్ గెలిచింది. కన్నెపల్లి సైతం కేసీఆర్‌కే జైకొట్టింది. ఫార్మారైతుల భూములు గుంజుకుని గ్లోబల్ సమ్మిట్ పేరిట కాంగ్రెస్ నడిపిన డ్రామాను జనం పట్టించుకోలేదు. సమ్మిట్ వేదిక ఉన్న మీర్ఖాన్పేటలో అధికార పార్టీ మట్టికరిచింది. ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్యుల గ్రామాల్లో బీఆర్ఎస్ విజయం ఓ సంకేతం! రెండేండ్ల పాలన ముగిసినందుకు సంబురాలు జరుపుకొని వారం కాకముందే పంచాయతీ ఎన్నికల్లో ప్రజల సుస్పష్ట తీర్పు కాంగ్రెస్‌కు ఓ హెచ్చరిక!
ఎన్నికల ఫలితాల విశ్లేషణ
మొత్తం గ్రామపంచాయతీలు12,728
వార్డులు 1,12,242

