Telangana | హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : భూ రికార్డుల్లో అనుభవదారు కాలమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చింది. రైతుల భూమి హక్కులను కాపాడుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ‘కాస్తు కాలమ్’ పేరుతో రైతులపై పిడుగు వేయనున్నది. గతంలో అనుభవదారు కాలమ్ వల్ల ఎంతో మంది రైతుల తలరాతలు తలకిందులైన విషయం తెలిసిందే. కౌలుదారులు తొలుత భూ రికార్డుల్లోని అనుభవదారు కాలమ్‌లో పేరు నమోదు చేయించుకుని, ఆ తర్వాత రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఏకంగా పట్టాలనే తమ పేరిట మార్పించుకునేవారు. ఆ విషయం నిరక్షరాస్యులైన రైతులకు చాలా కాలంపాటు తెలియకపోయేది. ఏదైనా అత్యవసరం వల్ల భూములు అమ్మేందుకు ప్రయత్నించినప్పుడే అసలు విషయం బయటపడేంది. దీంతో పంచాయితీలు, వివాదాలు, ఘర్షణలు తలెత్తి నేరాలకు దారి తీసేవి. ఫలితంగా పోలీస్ స్టేషన్లు, కోర్టులు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి రైతులు తమ సర్వస్వాన్ని కోల్పోయేవారు. దున్నుకొని బతకమని భూమిని కౌలుకు ఇస్తే ఆ భూమినే మింగేశారంటూ లబోదిబోమనేవారు. వివాదాల్లో ఉన్న భూమి అంటూ అగ్గువకు అమ్ముకొనేవారు.
ఈ దుస్థితి నుంచి రైతులకు విముక్తి కల్పించేందుకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2020 ఆర్వోఆర్ చట్టాన్ని అమలు చేసే సమయంలో అనుభవదారు కాలమ్‌ను రద్దు చేసింది. భూ రికార్డుల్లో కేవలం రైతు మాత్రమే ఉంటారని స్పష్టం చేసింది. దీంతో దొంత పట్టాలకు అవకాశం లేకుండా పోయిం ది. కౌలు రైతులను గుర్తించాలని ఓ సందర్భంలో ప్రతిపక్షాలు అసెంబ్లీలో అడగడంతో.. ‘కౌలుదారులను గుర్తిం చం. రైతు మెడకు మళ్లీ దూలం కట్టదలుచుకోలేదు’ అని నాటి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అనుభవదారు కాలమ్‌ను తీసుకొచ్చి రైతుల మెడకు మళ్లీ గుదిబండ కట్టేందుకు సిద్ధమైంది. 2014కు ముందు రికార్డుల్లో అనుభవదారు కాలమ్‌లో ఉన్నవారి పేర్లను మళ్లీ భూ రికార్డుల్లో చేరుస్తామని చెప్పింది. గతంలో మాన్యువల్ పహణీల్లో గజిబిజిగా 32 కాలమ్‌లు ఉండేవి. ప్రస్తుత పరిస్థితులకు అవి అవసరం లేకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ధరణిలో వ్యవసాయ భూమా? కాదా? అనే ఏకైక కాలమ్‌ను ఉంచింది.