హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో ఆర్టీఐ చట్టం పనిచేస్తున్నదా? అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 16వేల ఆర్టీఐ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. జనవరి 31న బీజేపీ తరఫున 27ప్రశ్నలకు అప్లికేషన్లు ఇచ్చినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తంచేశారు.
మార్చిలో మళ్లీ అప్పీల్ చేసినా ఫలితం శూన్యమని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను ఆర్టీఐ ద్వారా వివరాలు కోరితే ఇవ్వకపోవడం ఏమిటని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆర్టీఐ చట్టాన్ని నిలిపివేసిందా? అని ప్రశ్నించారు. దేశమంతటా పనిచేస్తున్న ఆర్టీఐ యాక్ట్ రాష్ట్రంలో మాత్రం ఎందుకు పనిచేయడం లేదో సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.