హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : ‘ఎన్నాళ్లీ బానిస బతుకులు. ఇంకెన్నాళ్లీ ఊడిగం. 50 వేల మందిమి 30వేలకు వచ్చాం. తిరగాల్సిన కిలోమీటర్లు పెరిగాయి. తిప్పాల్సిన డ్రైవర్లు, కండక్టర్లు తగ్గారు. పని భారం మరీ దారుణంగా పెరిగింది. మన హక్కుల కోసం ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు కొట్లాడుదాం’ అంటూ ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆర్టీసీలోని ఏ కార్మికుడిని కదిలించినా ఇదే సమాధానం ఇస్తున్నారని కార్మిక సంఘాల జేఏసీ నేతలు చెప్తున్నారు. తమ హక్కుల గురించి ప్రశ్నించే సమయం ఇదేనని ఏకమవుతున్నారు.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు కార్మిక సంఘాల పునరుద్ధరణ, వేతన సవరణ, ఏరియర్స్ వంటి సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఈ నెల 24న ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికులను ఐక్యం చేసేందుకు అన్ని డిపోలు, రీజియన్లలో కార్మికులు, ఉద్యోగులను కూడగడుతున్నారు. అన్ని డిపోల్లో ‘చలో సెక్రటేరియట్’ పోస్టర్లు ఆవిష్కరిస్తున్నారు.
ఆర్టీసీలో ఒకప్పుడు 50 వేల మంది సిబ్బంది ఉండగా, ఇప్పుడు 30 వేలకు చేరడంతో పనిభారం పెరిగిందని కార్మికులు వాపోతున్నారు. భారానికి మించి పనిచేస్తున్నా ప్రభుత్వానికి, ఆర్టీసీ సంస్థకు తమపై కనికరం లేదని మండిపడుతున్నారు. మరోవైపు మహాలక్ష్మీ పథకంతో అదనపు పనిభారం పెరిగినా, రోజుకు 16 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తున్నా తమకు ప్రభుత్వం అన్యాయమే చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఈ బానిస బతుకులు ఇంకెన్నాలని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం మారితే తమ బతుకులు మారుతాయని ఆశించినా.. ఈ ప్రభుత్వంలో నియంతృత్వం, నిరంకుశత్వం మరింత పెరిగిందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్నీ అమలు చేయకపోవడం పాలకుల వైఫల్యాలకు నిదర్శమని పేర్కొంటున్నారు. ప్రభుత్వం కండ్లు తెరిపించేందుకు మౌనం వీడి, పోరాటపంథాను నమ్ముకొని చలో సెక్రటేరియట్‌ను విజయవంతం చేద్దామని వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకుంటున్నారు.
ఆర్టీసీలో విలీనంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, 2021-2025 పీఆర్సీ, గత పీఆర్సీల ఏరియర్స్, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్‌ల రద్దు తదితర సమస్యల పరిష్కారం కోసం ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చినట్టు కార్మిక సంఘాల జేఏసీ నేతలు చెప్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు సీఎం, మంత్రులు, అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోవడంతోనే ఇందుకు సిద్ధమైనట్టు చెప్తున్నారు. ఈ ఉద్యమానికి కార్మికులంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్ని డిపోల్లో ‘చలో సెక్రటేరియట్’ పోస్టర్లు ఆవిష్కరిస్తున్నారు.