హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే పోటీపరీక్షల ఓఎంఆర్ షీట్లు కుప్పలు కుప్పలుగా రోడ్డుపక్కన పడి ఉండటం కలకలం రేపింది. హైదరాబాద్లోని పీవీఆర్ ఎక్స్ప్రెస్వే సమీపంలో పిల్లర్ నంబర్ 230 నుంచి 240 వరకు శనివారం సాయంత్రం ఓఎంఆర్షీట్లు ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది. వీటిలో హాల్టికెట్ నంబర్, పేపర్కోడ్, సెంటర్కోడ్, అభ్యర్థుల పేర్లు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్- 2018కు సంబంధించినవిగా గుర్తించినట్టు వెల్లడించారు. ఈ వ్యవహారం టీజీపీఎస్సీ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నదని విద్యావేత్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు మండిపడుతున్నారు.
ఘటనపై అనేక అనుమానాలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే పోటీ పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను నియామక ప్రక్రియ పూర్తయిన మూడేండ్ల వరకు భద్రపరుస్తారు. ఆ తర్వాత ప్రత్యేక కమిటీ సూచనలు, నిర్దేశిత నిబంధనల ప్రకారం జవాబు పత్రాలను నాశనం చేయడమో, ముక్కలు చేయడానికో పంపుతారు. కానీ పీవీఆర్ ఎక్స్ప్రెస్వే సమీపంలో ఓఎంఆర్ షీట్లు దర్శనమివ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై టీజీపీఎస్సీ చైర్మన్, ఉన్నతాధికారులు ఆరా తీశారు. వెంటనే విచారణ జరుపాలని టీజీపీఎస్సీకి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును ఆదేశించారు. మూడు రోజుల్లో నివేదిక అందించాలని కోరారు. ఈ విచారణలో తేలిన అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.