హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఆర్టీసీ కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. పోలీసుల పహారాలో బస్సుకో కానిస్టేబుల్‌ను పెట్టి బలవంతంగా నడుపాలని చూస్తున్నది. అయిన చెక్కు చెదరని ఆర్టీసీ కార్మికులు తెల్లవారుజాము నుంచే బస్సుల వద్దకు చేరి ఒక్క బస్సును కదలనీయడం లేదు. పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసినా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రజలను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో ప్రయాణికులు అధిక ధరలు చెల్లించ ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.
మెదక్ ఆర్టీసీ డిపో నుంచి తెల్లవారుజామున బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య బస్సులు నడిపేందుకు డిపో నుంచి బస్టాండ్ వరకు బస్సులు తీసుకురాగా కార్మికులు సమాచారం తెలుసుకొని భారీ సంఖ్యలో చేరుకొని అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో పోలీసులు కార్మికులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 తొమ్మిది డిపోల్లో 600 వందల బస్సులు నిలిచిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సమ్మె కొనసాగుతున్నది. కామరెడ్డి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల టెంట్‌ను పోలీసులు తొలగించడంతో వివాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రెండో రోజు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్ డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుట ధర్నా చేపట్టారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో బస్సులు నడుపాలని చూడగా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు.