హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ యాజమాన్యం కవ్వింపు చర్యలను తక్షణం ఆపకపోతే సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టంచేసింది. ఇంతకుముందు సమ్మెను వాయిదా వేశామని, విరమించుకోలేదని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను జూన్ 2లోగా అమలు చేయకపోతే సమ్మె తప్పదని, ఇందుకు ఆర్టీసీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కార్మిక సంఘాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం.. ఇప్పుడు ఏకపక్షంగా డిపోలు, రీజియన్లవారీగా వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశాలు నిర్వహించడమేంటని ప్రశ్నించింది. సమావేశాలను తక్షణం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ నెల 6న సచివాలయంలో జరిగిన చర్చల సందర్భంగా రవాణాశాఖమంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికుల సమస్యల పరిషారానికి హామీ ఇచ్చారని, అందులో యూనియన్ల పునరుద్ధరణ కూడా ఉందని గుర్తుచేశారు. హామీకి విరుద్ధంగా వెల్ఫేర్ బోర్డ్ మీటింగ్స్ గురించి సర్యులర్ జారీచేయడం పుండు మీద కారం చల్లినట్టు ఉందని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అడ్డుపడేలా ఆర్టీసీ యాజమాన్యం సమావేశాలు నిర్వహిస్తున్నట్టు భావిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ సంస్థల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తే సహించబోమని హెచ్చరించారు. ఆర్టీసీ సంస్థ ఎండీ ఇటువంటి సర్యులర్ ద్వారా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడం సమంజసంకాదని వారు పేర్కొన్నారు.
ఆర్టీసీలోకి ప్రైవేట్ బస్సులను తీసుకురావడం, గ్యారేజ్‌లను ప్రైవేటుపరం చేయడం మానుకోవాలని, ఔట్సోర్సింగ్ నియమాకాలు ఆపాలని కోరారు. లేకపోతే సమ్మె బాట పడుతామని జేఏసీ నేతలు చైర్మన్ ఈదురు వెంకన్న, కోచైర్మన్ హనుమంత్ ముదిరాజ్, వైస్‌చైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కోకన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, యాదగిరి హెచ్చరించారు.