RTC Strike | ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. పలుచోట్ల కార్మికులు డిపోల ఎదుట నిరసనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగుల విలీనం సహా పలు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించలేదు. అదే సమయంలో సమ్మె విచ్ఛిన్నానికి అడ్డదారుల్లో ప్రయత్నించిన కాంగ్రెస్ సర్కార్.. ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం చేయలేకపోయింది.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రవాణా రంగంలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్ల పరిషారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన పోరుబాట సమ్మెకు దారితీసింది. టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులతో ప్రభుత్వం మంగళవారం జరిపిన చర్చలు విఫలంకావడంతో కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) మంగళవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులకు రవాణా కష్టాలు మొదలయ్యాయి.
ఉదయం మొదటి విడత విధుల నుంచే బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై సరార్ మొదటి నుంచీ విముఖత ప్రదర్శిస్తున్నది. యూనియన్ల పునరుద్ధరణ వంటి ప్రాథమిక హకులను సైతం పెడచెవిన పెట్టింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తుంగలో తొకి, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుపై కార్మికలోకం భగ్గుమన్నది. సమస్యల తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ఆగమేఘాలపై ఒక కమిటీని వేసినప్పటికీ, అది కేవలం సమ్మెను నీరుగార్చే ఎత్తుగడగానే కార్మికులు భావిస్తున్నారు. సమస్యల పరిషారానికి మరో 4వారాల గడువు కావాలని కమిటీ కోరడాన్ని జేఏసీ తిరసరించింది. చర్చల్లో తమ 32 ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించలేదని కార్మిక నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోనున్నాయి. రోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురొనే అవకాశం ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్‌తోపాటు ప్రధాన నగరాల్లో సామాన్య ప్రజలు, విద్యార్థులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులను సమ్మె విరమించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిషారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని, అందుకే అధికారుల కమిటీని నియమించామని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె పిలుపుతో ప్రభుత్వం ఉలికిపడింది. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని చాలా రోజులుగా ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం.. సమ్మె సమయం దగ్గర పడుతుండటంతో ప్రభుత్వంలో భయం మొదలైంది. వేసవి తీవ్రత పెరుగడం, పరిషత్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని ఆర్టీసీ యాజమాన్యానికి అర్థమైంది. సమ్మెకు వివిధ రాజకీయ పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు మద్దతివ్వడంతో ప్రభుత్వం దిగొచ్చింది. దీంతో మంగళవారం ఆగమేఘాల మీద ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు పిలిచింది.
ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంస్థ పరిరక్షణ సహా పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు ఈ నెల 13న సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సమ్మెను వాయిదా వేశారు. బుధవారం నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకటించడంతో ప్రభుత్వం హుటాహుటిన టీజీఎస్ఆర్టీసీ సమస్యలు పరిశీలించడానికి అధికారుల కమిటీ ఏర్పాటుచేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఆర్థిక, కార్మికశాఖల ముఖ్య కార్యదర్శులను సభ్యులుగా నియమించారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వైస్ చైర్మన్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని సమస్యలపై సమగ్ర అధ్యయనం చేపట్టి 4వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని సర్కార్ ఆదేశించింది.
కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్న తరుణంలో ఆర్టీసీ యాజమాన్యం ఆగమేఘాలపై ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులను చర్చలకు పిలిచింది. తమ 32 ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కార్మిక నేతలు కోరారు. ముఖ్యంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణతోపాటు సంస్థ పరిరక్షణ చర్యలకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఇందుకు 4వారాల గడువు కావాలని కమిటీ చెప్పడంతో జేఏసీ నేతలు బయటకు వచ్చేశారు. మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు జరిగిన చర్యలు విఫలమయ్యాయని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఒకవైపు చెప్తూనే.. మరోవైపు సమ్మె అనివార్యమైన పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పేరుతో సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని జేఏసీ మండిపడింది.
ప్రభుత్వం ఉత్తుత్తి హామీలు ఇస్తే వెనక్కి తగ్గేది లేదని, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో-కన్వీనర్ థామస్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అవసరమని చెప్పారు. తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాలయాపన చేయడానికే విలీన కమిటీ వేశారని ఆరోపించారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేయాలని చూస్తున్నారని, కానీ ఆర్టీసీని మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు మూసీ అభివృద్ధి ఎలా చేస్తారో? చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఔట్సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలని, మరో సకల జనుల సమ్మెగా ఆర్టీసీ సమ్మె మారబోతున్నదని తేల్చి చెప్పారు. ఆర్టీసీని హైదరాబాద్‌లో లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వబోమని అద్దె బస్సుల యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది. సంఘం పరిధిలో ఉన్న దాదాపు 3,500 అద్దె బస్సులు యథావిధిగా నడుస్తాయని అసోసియేషన్ వెల్లడించింది. సమ్మె అనివార్యమైతే ప్రజారవాణా అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉన్నదని భావించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నది. అద్దె బస్సులతోపాటు స్కూల్ బస్సులను కూడా వినియోగించుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ దశలో ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలను సమ్మెకు సమాయత్తం చేశారు.
సమ్మెపై ఆర్టీసీ కార్మికులు పునరాలోచన చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ‘ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసే బాధ్యత మనందరిపై ఉన్నది’ అని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ముందు సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యాన్ని ప్రభుత్వం చూస్తదని, ఎలాంటి భేషజాలకు పోకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని, నిర్ణయాలు తీసుకొనే విషయంలో కొంత జాప్యం జరుగొచ్చని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిషారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగవద్దనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదని తెలిపారు.
ప్రలోభాలకు లోనుకాకుండా, సంస్థ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కార్మికులందరూ విధులకు హాజరై ప్రభుత్వానికి సహకరించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి విజ్ఞప్తిచేశారు. ముఖ్యంగా ఆర్టీసీపై ఆధారపడి ప్రయాణించే కూలీలు, చిరుద్యోగులు, సామాన్యులకు ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉన్నదని, అందరూ బాధ్యతాయుతంగా విధుల్లో పాల్గొనాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. కార్మికులు కోరుతున్న డిమాండ్లలో కొన్ని ఆర్థిక పరమైనవి, సంక్లిష్టమైన అంశాలు ఉన్నందున, వాటిని లోతుగా పరిశీలించి పరిషరించడానికి ప్రభుత్వానికి కనీసం 4వారాల సమయం పడుతుందని, ఈ మేరకు ప్రభుత్వం గడువు కోరిందని పేరొన్నారు. దశలవారీగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. వాస్తవాలను కొన్ని సంఘాలు విస్మరించి సమ్మెకు దిగి తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆక్షేపించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకున్నది. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏడాది నుంచి గడువు ఇచ్చినా పరిష్కరించలేదు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నది. 32 డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మెను ఆపేది లేదు. ఉద్యోగాలు పోతాయని సర్కార్ బెదిరిస్తున్నది. భయపడాల్సిన పనిలేదు. ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే. కార్మికులంతా కచ్చితంగా సమ్మెలో పాల్గొనాలి.
-ఈదురు వెంకన్న, ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తీరుతాయని భావించాం. కానీ, సర్కార్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నది. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనేలేదు. అందుకే సమ్మెకు దిగాం. కార్మికుల సమస్యలు గొంతెమ్మ కోర్కెలేమీ కావు. ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలనే మేము అడుగుతున్నాం. సూపర్వైజర్లు, మెకానిక్‌లు, డ్రైవర్లు, అందరూ సమ్మెలో పాల్గొనాలి.
– థామస్ రెడ్డి, జేఏసీ వైస్ చైర్మన్
ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. తేలికగా పరిష్కారమయ్యే సమస్యలైనా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రెచ్చగొడుతున్నది. సర్కార్‌తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. హక్కులను తప్పకుండా సాధించుకుందాం. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తే, కాలయాపన కోసం ప్రభుత్వం కమిటీ వేసింది.
– కత్తుల యాదయ్య, కార్మిక సంఘం నేత
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సర్కార్‌ను కోరుతూ ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చాం. ప్రభుత్వం మాత్రం చర్చల పేరిట మా ఆశలను నీరుగార్చింది. ఈ ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచన లేదు. కార్మికులంతా సమ్మెకు పోవాలన్న ఆలోచనలోనే ఉన్నది. అందుకే కాలయాపన కోసం కమిటీ ఏర్పాటుచేసింది. దీనిని ఆర్టీసీ కార్మిక జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
– సురేశ్, కార్మిక జేఏసీ నేత
కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ సంస్థ నిర్వీర్యం అవుతుంది. దీంతో కార్మికుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ప్రజాపాలన పేరిట సర్కార్ దగా చేస్తున్నది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరితే.. నిర్లక్ష్యం చూపుతున్నారు. సర్కార్‌తో చర్చలు విఫలమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కవు.
-యాదగిరి, కార్మిక జేఏసీ నేత