హైదరాబాద్, నవంబర్ 5(నమస్తేతెలంగాణ) : ఆర్టీసీలో ప్రైవేటు బస్సులను తగ్గించాలని, కొత్త బస్సులను కొనుగోలు చేసి ఉద్యోగులకు భద్రత, రక్షణ కల్పించి ఆర్టీసీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని టీజీఎస్ఆర్టీసీ జాక్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన నిరసనల్లో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించి నిరసనలు తెలిపారు. హైదరాబాద్‌లో జాక్ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్ల నేతృత్వంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ..
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గెజిట్ విడుదలైనప్పటికీ అపాయింటెడ్ డేట్ ప్రకటించి జీవోను విడుదల చేయడంలో ప్రభుత్వం జా ప్యం చేస్తున్నదని విమర్శించారు. ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరిస్తామని ప్రకటించినప్పటికీ దానిని అమలుచేయకుండా వెల్ఫేర్ బోర్డుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతి నెలా రూ.350 కోట్లు విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే డిసెంబర్ 5న సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జాక్ క న్వీనర్ ఎండీ మౌలానా, కోకన్వీనర్లు యాద య్య, సురేశ్, యాదగిరి, ఉద్యోగులు కమలాకర్‌గౌడ్, అహ్మద్, రాములు, ఆర్ఎన్ రెడ్డి, ధనుంజయ్, ఐలయ్య, సీకే రెడ్డి, రాఘవయ్య, మల్లయ్య, రవి, లక్ష్మయ్య, ఎల్ఎన్ గౌడ్, నాగరాజు, సురేందర్ పాల్గొన్నారు.